రేపటి రోజు రేవంత్‌ మాటకు విలువెంత?

https://epaper.netidhatri.com/

` రైతులు రుణాలు తీసుకుంటే తీర్చేదెవరు?

`గతంలో బండి సంజయ్‌ మాటలు ఏమయ్యాయో చూసిందే!

`దళిత బంధు విషయంలో ఈటెల మాటలు నమ్మితే ఏమయ్యేది?

`సీనియర్ల నుంచి కానిది కొత్త వారితో రేవంత్‌ కు చెక్‌ పడేనా?

`షర్మిల వస్తే రేవంత్‌ మాట చెల్లుబాటౌనా?

`షర్మిల రాకపై సీనియర్ల మౌనం దేనికి సంకేతం?

` కేవిపి ఇప్పుడు ఎందుకు నేను తెలంగాణ అంటున్నారు?

`సీనియర్ల మద్దతు లేకుండానే ఇదంతా జరుగుతోందా?

`రేవంత్‌ వద్దనుకున్న పొంగులేటి వచ్చాడు?

`పొంగులేటి వచ్చి షర్మిలకు మార్గం సుగమం చేశాడు.

`రేపు కేవిపి వస్తాడు?

`రేవంత్‌ ను పక్కన పెట్టకుండా వుంటారా?

` రేవంత్‌ కు మద్దతు ఇప్పుటికే కరువు?

`షర్మిల రాకతో రేవంత్‌ రాజకీయం కనుమరుగు?

https://epaper.netidhatri.com/

హైదరబాద్‌,నేటిధాత్రి:

పార్టీలో తన ఉనికికే నమ్మకం లేని చోట, తన పదవికే గ్యారెంటీ లేని పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు వింటూ సొంత పార్టీ నేతలే గొల్లున నవ్వుకుంటున్నారు. ప్రజలను నమ్మించాలంటే అబద్దాలే చెప్పాల్సిన అవసరం లేదు. నిజాలు చెప్పి కూడా ప్రజల విశ్వాసం చూరగొనొచ్చు. కాని రాజకీయాల్లో ఎవరు నిజాలు చెబుతున్నారో..ఎవరు అబద్దాలు చెబుతున్నారో కూడా తెలియని అయోమయ పరిస్ధితుల్లో ఎన్నికల తరుణం వచ్చేసింది. ఈ సమయంలో తన భవిష్యత్తును తానే కొండంత ఊహించుకొంటూ రేవంత్‌ రెడ్డి పెద్దపెద్ద మాటలే చెబుతున్నాడు. కాని కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పదవికి గండం వచ్చే సూచన కూడా షర్మిల రూపంలో కనిపిస్తున్నాయన్నది మర్చిపోతున్నాడు. తాజాగా ఆయన రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు చేసిన వ్యాఖ్యల దుమారం నుంచి తప్పించుకోవడానికి, రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల అప్పులు తీసుకోండి. తర్వాత మాఫీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. అసలు ఎన్నికల దాకా తన పదవి వుంటుందో ఊడుతుందో కూడా తెలియని రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు. రైతులు సాగు చేసుకునేందుకు ఎకరాకు ఎంత కరంటు కావాలో కూడా తెలియని రేవంత్‌రెడ్డి, బ్యాంకు రుణాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎకరం భూమి వున్న చిన్న సన్న కారు రైతులకు బ్యాంకు ఎంత రుణం ఇస్తుందో రేవంత్‌ రెడ్డికి ఏమైనా అవగాహన వుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రైతుకు రెండు లక్షల అప్పు ఇవ్వాలంటే కనీసం పది ఎకరాల భూమి వుండాలి. బ్యాంకులు ఎకరానికి 15వేల రూపాయల నుంచి 18వేలు మాత్రమే ఇస్తుంది. అంటే రెండు లక్షల రుణం రావాలంటే పది ఎకరాల ఆసామి రైతులకే వర్తిస్తుంది. అక్కడ కూడా చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగేదేమీ వుండదు. గతంలో ఎకరానికి మూడు గంటలు చాలని మిడిమిడి జ్ఞానంతో చెప్పి తెలంగాణ రైతాంగం చేత చీవాట్లు తిన్నాడు. ఇప్పుడు రెండు లక్షల రూపాయల రుణం తీసుకొమ్మని తన అజ్ఞానాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇలాంటి వారి చేతుల్లో పరిపాలన పెడితే తెలంగాణ మళ్లీ పాత రోజులను చూడాల్సి వస్తుంది. ఒక వేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇండ్లకు ఇరవై నాలుగు గంటలు ఎందుకు? అని పగలంతా కోతలు పెట్టినా పెడతారు? ఇప్పుడే ఇన్ని అవగాహన లేని మాటలు, అబద్దాలు చెబుతున్నవారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తప్ప అధికారంలోకి రాలేమని రేవంత్‌రెడ్డి లాంటి వారు అభిప్రాయపడుతున్నట్లున్నారు. ఆ మధ్య జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో అప్పటి బిజేపి రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ ఇలాగే ప్రకటన చేశాడు. ఆదే సమయంలో కరిసిన వర్షాలకు నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం కోసం ఏం నష్టం జరిగినా వాటిని తీర్చుతామన్నాడు. బండ్లుపోయిన వారికి బండ్లు, ఇండ్లు కూలిన వారికి ఇండ్లు, కార్లు పోయిన వారికి కార్లు, వస్తువులు పోయిన వారికి వస్తువులు ఇస్తామని అలవి కాని హామీలు బండి సంజయ్‌ ఇచ్చాడు. తర్వాత తూచ్‌ అన్నాడు. ఇన్యూరెన్స్‌ కంపనీలతో మాట్లాడతామని తన సహజసిద్దమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ప్రజలకు పార్టీని మరింత దూరం చేశాడు. అంతే కాకుండా బిజేపిలో చేరిన ఈటెల రాజేందర్‌ కూడా దళిత బంధు విషయంలో కూడా ప్రజల్లో గందరగోళం సృష్టించి, లక్షాదికారులు కావాల్సిన దళితుల జీవితాలకు న్యాయం జరక్కుండా చేశాడు. మొదటి దఫా దళిత బంధు అందుకున్న రైతులను అయోమయంలో పడేసి, ప్రభుత్వం అందజేసిన దళిత బంధు చేతిలో లేకుండా కావడానికి పరోక్ష కారణం ఈటెల రాజేందర్‌ అన్న అపవాదును ఎదుర్కొంటున్నాడు. తమ రాజకీయాల కోసం ప్రజల్లో గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకోవడానికి ప్రజల జీవితాలను ఆగం చేసే నాయకులు ఇలా వుంటారు. అందుకే ప్రజలు కూడా నాయకులు చెప్పే విషయాల్లో ఎంత నిజాయితీ వుందన్నది గమనించాలి.
ఇక అసలు రేవంత్‌రెడ్డి తన పదవికే గ్యారెంటీ లేదు.
ఆయన మాటలు నమ్ముకొని ఒక వేళ రైతులు రుణాలు తీసుకున్నా, తీర్చేందుకు పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. రేవంత్‌రెడ్డి మాట నిలుపుకునేది లేదు. ఎందుకంటే ఆది నుంచి రేవంత్‌ను ఎలా దింపాలన్నదానిపై పార్టీలో అందివిచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని సీనియర్లు ఎదురు చూస్తూ వున్నారు. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది. రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు చేసిన వ్యాఖ్యలతోనే సీనియర్లు గుర్రుగా వున్నారు. దానికి తోడు రేవంత్‌రెడ్డి సైన్యం పేరుతో సీనియర్లైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, విహనుమంతారావు లాంటి వారికి నిత్యం చుక్కలు చూపిస్తూ వస్తున్నారు. గత రెండేళ్లుగా వాళ్లు పార్టీ మారుతున్న చేయాల్సినంత ప్రచారం చేస్తూనే వున్నారు. ఆ కసి వారిలో నిగూడంగా వుంది. ఏ రెడ్డి నాయకత్వాన్ని ఏకం చేసి, రేవంత్‌ అందలమెక్కాలనుకున్నాడో అదే రెడ్డి వర్గం ఇప్పుడు ఆయనకు ఆశనిపాతంగా మారే రోజులు దగ్గర్లోనే వున్నాయి. అందుకు మొదటి అస్త్రం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌లో చేరనే చేరింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ముందు రేవంత్‌ రెడ్డి అంగీకరించలేదు. ఆయనపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆ తర్వాత అనివార్య పరిస్ధితుల్లో పొంగులేటిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు షర్మిల రూపంలో మరో అస్త్రం రానున్నది. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నా అన్నప్పుడే రేవంత్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాంతో షర్మిల అడుగడుగునా రేవంత్‌పై సెటైర్లు వేస్తూ వచ్చింది. రేవంత్‌రెడ్డి పాదయాత్ర మీద అనేక విమర్శలు చేసింది. రేవంత్‌ రెడ్డి పాదయాత్రపై షర్మిల చేసిన కామెంట్లు పెద్దఎత్తున ట్రోల్‌ అయ్యాయి. ఇప్పుడు ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్నదని తెలుస్తోంది. షర్మిల రాకతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి ఆత్మ కేవిపి కూడా వచ్చి చేరుతుంది. అప్పుడు రేవంత్‌కు పార్టీలో చోటు లేకుండాపోతుందనేది కొందరి భావన. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వస్తున్నప్పుడు అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నం చేసిన వాళ్లే ఇప్పుడు షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. అందుకే షర్మిల పార్టీలోకి వచ్చే విషయంలో ఎవరూ స్పందించడం లేదు. అలా అని వద్దని కూడా అనడం లేదు. మౌనం కొన్నిసార్లు అర్ధాంగీకారమేకాదు, పూర్ణాంగీకారం కూడా అవుతుంది. షర్మిల వస్తే రేవంత్‌కు చెక్‌ పెట్టొచ్చన్న ఆలోచనతో సీనియర్లు వున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు అదే కనిపిస్తోంది. షర్మిల రాక, రేవంత్‌పోక రెండూ జరగడం ఖాయమంటున్నారు. ముందు ముందు ఏం జరుగుతుంతో చూద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *