
DNA Tamil Movie
అసలేం జరుగుతోంది…
అధర్వ మురళీ తాజా చిత్రం ‘డి.ఎన్.ఎ.’ తెలుగులో ‘మై బేబీ’గా రాబోతోంది. అయితే ఈ తెలుగు వర్షన్ విడుదల అయ్యి కాగానే ఓటీటీలో దర్శనం ఇవ్వబోతోంది. ఇది తెలుగు నిర్మాతలను షాక్ కు గురిచేసే అంశం.
ప్రముఖ నటుడు అధ్వర్య మురళీ (Atharvaa Murali), నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటించిన తమిళ చిత్రం ‘డి.ఎన్.ఎ.’ (DNA). ఇది జూన్ 20న తమిళంలో విడుదలైంది. అదే సమయంలో తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. కానీ కారణాలు ఏవైనా ఆ సినిమా తెలుగులో ఆ టైమ్ లో రాలేదు.
అయితే అప్పటికే ఈ సినిమా ను ఐదు ప్రధాన భారతీయ భాషల్లో జియో హాట్ స్టార్ ద్వారా జులై 25న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. అంటే తెలుగు వర్షన్ విడుదలైన వారానికే ఈ సినిమా జియో హాట్ స్టార్ లో వచ్చేస్తుందన్న మాట. డబ్బింగ్ సినిమాకు వారం కంటే థియేట్రికల్ రన్ ఉండదనే నమ్మకం బహుశా నిర్మాతలకు వచ్చి ఉండొచ్చు. ఇక్కడే చిత్రంగా ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తెలుగు వర్షన్ రిలీజ్ జూలై 11 నుండి 18కి పోస్ట్ పోన్ అయినట్టుగానే… ఇప్పుడు జియో హాట్ స్టార్ తన స్ట్రీమింగ్ డేట్ ను జూలై 25 నుండి జూలై 19కి ప్రీ పోన్ చేసేసింది. అంటే… ఇప్పుడు తెలుగు వర్షన్ ‘మై బేబీ’ విడుదలైన రోజే… అర్థరాత్రి నుండి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో దర్శనమిస్తుందన్న మాట.
ఒక తమిళ డబ్బింగ్ మూవీ ఇలా విడుదలై కాగా ఓటీటీలో దర్శనం ఇవ్వడం ఏమిటనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ముందే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ తో ఒప్పందం చేసుకుని ఉంటే… తెలుగు హక్కుల్ని వేరొకరికి ఎందుకు అమ్మారు? అనే సందేహం కలుగుతుంది. తెలుగులో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారికి ఈ చిత్ర ప్రధాన నిర్మాతలకు మధ్య ఏమైనా వ్యవహారం బెడిసి కొట్టిందా అనే డౌట్ కూడా వస్తుంది. ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయకపోవడం, ఆ తర్వాత ముందుగా జులై 11 అని చెప్పి ఒకసారి… కాదు… 18న వస్తున్నాం అని మరోసారి వాయిదా వేయడం వెనుక ఏం జరిగిందనేది కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా… జూలై 25వ తేదీన స్ట్రీమింగ్ చేస్తామని చెప్పి జియో హాట్ స్టార్, హఠాత్తుగా ఓ వారం ముందుకు ఎందుకొచ్చిందనేదీ పలు ఆలోచించాల్సిన అంశమే. ఈ విషయంలోని లొసుగుల్ని తేల్చి చెప్పాల్సింది తమిళ నిర్మాతలు… తెలుగు సినిమా హక్కుల్ని తీసుకున్న వారే! వారి నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ఏదేమైనా తెలుగులో ‘డీఎన్ఎ’ను ‘మై బేబీ’గా విడుదల చేద్దామని అనుకున్నవారికి మాత్రం ఈ నిర్ణయం అశనిపాతం లాంటిదే!