చెన్నూర్ మున్సిపాలిటీకి స్వాగతం తోరణం
మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల,నేటి ధాత్రి:
చెన్నూర్ మున్సిపాలిటీ ప్రవేశ ప్రాంతం వద్ద స్వాగత తోరణం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.శనివారం జిల్లాలోని చెన్నూర్ మున్సిపల్ పరిధిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ లతో కలిసి 50 లక్షల రూపాయల నగరాభివృద్ధి నిధులతో చేపట్టిన ఖమాన నిర్మాణం, 1 కోటి రూపాయల నగరాభివృద్ధి నిధులతో వివిధ వార్డులలో కల్వర్టుల నిర్మాణం,50 లక్షల రూపాయలతో పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ పట్టణంలో దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని,50 లక్షల రూపాయలతో ఖమాన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యార్థం స్మశాన వాటిక ఏర్పాటులో భాగంగా 1 ఎకరం విస్తీర్ణం గల భూమిని సేకరించి 1 కోటి 20 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గల ప్రాంతాన్ని పార్క్ గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కొరకు 1 కోటి రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ప్రజల అభీష్టం మేరకు చెన్నూర్ పట్టణంలో ఆర్ టి సి డిపో ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, పట్టణ ప్రజల కొరకు చెన్నూర్ నుండి హైదరాబాద్ కు బస్సు నడిపించడం జరుగుతుందని, ఉదయం 5 గంటలకు బస్సు ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 కోట్ల రూపాయలు,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1 కోటి 50 లక్షల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని,50 లక్షల రూపాయలతో ముదిరాజ్,30 లక్షల రూపాయలతో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని,15 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులతో మెరుగు సంఘ భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా ప్రయోజనార్ధం అంతర్గత రహదారులు,మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 250 బోర్ వెల్ ఏర్పాటు చేయడం జరిగిందని,అమృత్ పథకంలో భాగంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు 50 శాతం పూర్తయ్యాయని, పనులు వేగవంతం చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టి పనులు కొనసాగుతున్నాయని, చెన్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ద్వారా వీటిని వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూర్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా 24 కోట్ల రూపాయల టి ఎఫ్ ఐ డి సి, 4 కోట్ల రూపాయల డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులతోపాటు నగరాభివృద్ధి నిధులతో పనులు చేపట్టి చెన్నూర్ పట్టణాన్ని ఆధునికరించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.అంతర్గత రహదారులు,మురుగు కాలువల వ్యవస్థ,త్రాగునీటి సరఫరా కొరకు చర్యలు చేపడుతున్నామని,చెన్నూరు పట్టణంలో 31 బోర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని,అమృత్ పథకం ద్వారా నీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.పట్టణంలోని కూరగాయల వీధి వ్యాపారుల కొరకు సమీకృత కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు కొనసాగుతున్నాయని, ఆసుపత్రికి అవసరమైన ఫర్నిచర్,పరికరాల కొరకు ఆర్డర్ చేయడం జరిగిందని, 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో చెన్నూర్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.కోటపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఆశ్రమ పాఠశాల పనులు పూర్తి చేయబడి ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
