“నేటిధాత్రి” కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు.
నిబంధనలు అతిక్రమించి ఆక్రమణలు, కట్టడాలు చేసిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును
—వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్
కాశిబుగ్గ, నేటిధాత్రి
వరంగల్ “ఎస్ఆర్ నగర్లో” అక్రమణలపై విచారణ చేయండి. వరంగల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక యువకులు పిర్యాదు అనే శీర్షికతో శుక్రవారం “నేటిధాత్రి” పత్రికలో వెలువడిన కథనం, గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో కొనసాగుతున్న ఖబ్జాల పర్వం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ కావడంతో వరంగల్ తహసీల్దార్ ఈ క్రింది ప్రకటన విడుదల చేశారు.
ఎస్ఆర్ నగర్ ప్రజలకు, లబ్ధిదారులకు విన్నపం.
గత 4 రోజులనుండి ఎస్ఆర్ నగర్ లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని ఫిర్యాదులు ఒచ్చిన నేపథ్యంలో మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో ప్రాథమిక విచారణ చేయడం జరిగింది. ఇట్టి విషయంలో ఎస్ ఆర్ నగర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా కొందరు గొడవలు సృష్టించుకుంటున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇట్టి విషయంలో సవివరమైన విచారణకు మండల సర్వేయర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయ సిబ్బంది స్థల పరిశీలన చేయుటకు పోలీసు వారి సహకారంతో రెండు రోజులలో వస్తున్నారు. ఈ విచారణకు వచ్చు క్రమంలో మా కార్యాలయ రెవెన్యూ రికార్డులు, గత డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల జాబితా, వాస్తవ లబ్ధిదారుల పట్టికతో పోల్చుకుని అర్హులైన వారికి ఏ విధంగా న్యాయం చేయాలో పరిశీలించి, తగు చర్య తీసుకునబడును. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించి ఆక్రమణలు, కట్టడాలు చేసిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకునబడును అని వరంగల్ తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో స్థానిక యువకులు సంతోషం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.