Indira Mahila Sarees Distributed to Eligible Women
అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చందుర్తి, మల్యాలలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం*
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల/చందుర్తి(నేటి ధాత్రి):
అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
చందుర్తి మండల కేంద్రంతోపాటు మల్యాల గ్రామంలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో చీరలు పంపిణీ మొట్టమొదట మల్యాల గ్రామం ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఆకాశంలో సగం మహిళలు కాబట్టి ఆకాశంలో ఉన్న నీలి రంగు చీరలు సెలక్ట్ చేశామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష 45 వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాలలో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. స్వంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, జిల్లాలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు
మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, చందుర్తి మండలంలోని స్వశక్తి మహిళలు ముందుకు వస్తే వారికి రైస్ మిల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మల్యాల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్యాంకు మంజూరు చేశామని తెలిపారు.
చందుర్తి- మోత్కురావుపేట రోడ్డు నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
వస్త్ర పరిశ్రమ సాధికారత.. మహిళా ఆత్మగౌరవానికి ప్రతీక

ఇందిరా మహిళా చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి ఎస్ హెచ్ జీ ల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యత చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం*మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి* కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యమనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వామ్యులను చేస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మత్తుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తుందని, కొనుగోలు కేంద్రాలు, ఇతర వ్యాపారాలకు అవకాశం కల్పించిందని తెలిపారు.
ఎస్ హెచ్ జీ ల్లో ప్రస్తుతం 18- 59 ఏండ్ల వారికి అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పుడు 15-18 ఏండ్ల కిశోర బాలికలకు, 60 ఏండ్ల వయసు పైబడిన వారికి కూడా సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని, ఇప్పటిదాకా 117 మందికి రూ. రెండు లక్షల వరకు రుణ బీమా, ఐదుగురికి రూ. 10 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు చేసిందని వెల్లడించారు. జిల్లాలో కొత్తగా 5560 మంది ఎస్ హెచ్ జీల్లో చేరారని తెలిపారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతోపాటు ఇప్పుడు ఎస్ హెచ్ జీ సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు.
