రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ప్రజలు తరలిరావాలి…
పట్టణ కాంగ్రెస్ నాయకులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
రామకృష్ణాపూర్ పట్టణం నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు నిత్యం రైల్వే గేట్ సమస్యతో సతమతం అవుతున్న వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈ నెల 15 మంగళవారం రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తారని టిపిసిసి సెక్రటరీ రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు , సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు.

ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ వేలాది వాహనాలు రైల్వే ట్రాక్ దాటి వెళ్లేవని ఆ సమయంలో గేటువేయడంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. రైలు వెళ్లిన అనంతరం వాహనాలు గేటు దాటడానికి అర గంటకుపైగా సమయం పట్టేదని, ఇదే సమయంలో రైళ్ల సంఖ్య కూడా పెరగడంతో తరచూ గేటువద్ద వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి ప్రారంభోత్సవం ఆలస్యం అయిందని, బ్రిడ్జికి పునాది వేసిన వివేక్ వెంకటస్వామి నే ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. బ్రిడ్జి ప్రారంభంతో ప్రజల కష్టాలు తీరనున్నాయని, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంత ప్రజలు ఈనెల 15న బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ ప్రదేశాన్ని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పనాస రాజు, కాంగ్రెస్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.