సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
భద్రాచలం, ఫిబ్రవరి, 3:
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తేవాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీని తిరిగి గెలిపించాలని కార్యకర్తలను కోరారు. శనివారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. శాసనసభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నుంచి గొంతు విప్పే అవకాశం కల్పించిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపీ రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు. అలవి కాని, ఆచరణ సాధ్యం కాని 420 హామీలతో.. ప్రజలను మభ్య పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ లను సమర్ధవంతంగా నిర్వహించబట్టే రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల మేలు కోరి సంక్షేమ పథకాలతో.. రాష్ట్రంలో మెరుగైన పాలన అందించింది ఉద్యమ నేత కేసీఆర్ అనే విషయం మరువరాదని కోరారు. తిరిగి కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం పార్లమెంట్ ఎన్నికల రూపంలో మళ్లీ వచ్చిందని రవిచంద్ర గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ లో మాట్లాడలేదు.. కేంద్రం తో కొట్లాడి నిధులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అద్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియా, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.