అప్పులున్నా హామీలు నెరవేరుస్తున్నాంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:
ఎన్నికల హామీలను ఏడాదిలోనే 85శాతం నెరవేర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భరోషా పెన్షన్లను మూడువ డిజవన్ లోని ప్రగతీనగర్ లో ఎమ్మెల్యే లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులతోపాటు సిపిఐ నాయకులు పెంచలయ్య పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రధాన డ్రైనేజీ కాలువ ఎత్తు తక్కువుగా ఉండటంతో మురుగు నీరు పొర్లి ఇళ్ళలోకి వస్తున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాలనీ విస్తరిస్తున్నా విద్యుత్ అధికారులు పోల్స్ ఏర్పాటు చేయకపోతుండటంతో తమకు వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. కాగా సిపిఐ నాయకులు పెంచలయ్య ప్రగతీనగర్ లోని సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేలు చేసి ఏడాది నిండిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుపతిలో 18వేల 664 మంది పెన్షనర్లు ఉండగా వారికి 8 కోట్ల 23 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన పిఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం త్వరలో ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన చెప్పారు. అలాగే ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకు పెంచేందుకు ఐదేళ్ళు పట్టిందని ఆయన విమర్శించారు. బటన్ నొక్కి సొంత ప్రచారం మాజీ సిఎం జగన్ చేసుకున్నారే తప్ప లబ్దిదారులకు డబ్బులు మాత్రం పడలేదని ఆయన ఆరోపించారు. 10లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం దివాళా తీయించినా ప్రధానమంత్రి నరేంద్ర మోది సహకారంతో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్ళలో ముందుకు తీసుకువెళ్ళుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనాయుకుళు లోకేష్ లదేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం, సిపిఐ నాయకులు పెంచలయ్య, జనసేన నాయకులు రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.