Water Crisis in Double Bedroom Colony
డబల్ బెడ్ రూమ్ నిర్వాసితులకు నీటి వసతిని వెంటనే కల్పించాలి
-బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ డిమాండ్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఇల్లు లేని బాధితులకు గూడు కల్పించిన బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి వసతి కూడా పరిపూర్ణంగా కల్పించాలని, నీటి సమస్య పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు. పెద్దూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ కావడంతో సమస్యను తెలుసుకొని కాలనీని శుక్రవారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమిక అవసరాలు నిర్మించడంలో విఫలమయ్యారని అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఉదయం నుండి రాత్రి వరకు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్, మున్సిపల్ సిబ్బంది ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎంపీ ఇచ్చిన బోర్లు గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే పనిచేస్తున్నాయని పైన ఉన్న ఇండ్లకు మిషన్ భగీరథ ఏకైక మార్గం అని, గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో పైన ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పేద ప్రజల కష్టాలను అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్రంగా విమర్శించారు. పేద ప్రజలకు ఇల్లు కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు వారికి సౌకర్యాలు కల్పించక వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు అందించాలని నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని తక్షణ చర్యలు చేపట్టాలని లేకుంటే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
