Warangal Municipal Commissioner Fines Reliance Store
శెభాష్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ – రిలయన్స్ స్టోర్‌కు జరిమానా
కొన్ని రోజులుగా వాహనాలు రోడ్డు మీద పార్కింగ్. నగరంలోని అన్ని షాపింగ్ మాల్స్ ఇదే విధంగా అమలు చేయాలని కోరుతున్న ప్రజలు.
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ నగరంలో పౌరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పార్కింగ్ సమస్యపై మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ కఠిన చర్యలు తీసుకున్నారు.

పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ వద్ద గత కొన్ని రోజులుగా వాహనాలు రహదారిపై అస్తవ్యస్థంగా పార్క్ చేయడం వల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ స్టోర్ యాజమాన్యంపై జరిమానా విధించారు. జరిమానా చెల్లింపు వరకు స్టోర్‌లో క్రయవిక్రయాలు జరగకుండా బల్దియా సిబ్బంది స్టోర్ ద్వారాలను మూసివేశారు.

రోడ్డుపై పార్కింగ్ సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన కమిషనర్ చర్యలను స్థానిక కాలనీ వాసులు అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసిన మున్సిపల్ అధికారుల నిర్ణయం నగరంలో శ్లాఘనీయమని పలువురు పేర్కొన్నారు.
