జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవంబర్ 1,2020 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులు మాత్రమే అర్హులు
ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 (ఆన్లైన్ / ఆఫ్ లైన్) ద్వారా నూతన పట్టభద్ర ఓటర్ల దరఖాస్తు లకు ఆహ్వానo
భూపాలపల్లి నేటిధాత్రి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా కట్టుదిట్టంగా రూపోందించాలని, ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 (ఆన్లైన్ / ఆఫ్ లైన్) ద్వారా నూతన పట్టభద్ర ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు పై తహసిల్దార్ లు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని అన్నారు.
ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి ఉమ్మడి వరంగల్ , ఖమ్మం , నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న పట్టభద్రులంతా ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఆన్ లైన్ ద్వారా లేదా మండల తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతి మండలంలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించాలని , పట్టపద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హత సర్టిఫికెట్ల కాపీలు గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరించి సమర్పించాలని అన్నారు.
నవంబర్ 1 2023 ప్రామాణికంగా ఓటరు జాబితా రూపొందిస్తున్నామని, నవంబర్ 1 2020 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన పట్ట భద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా రూపకల్పన పై జనవరి 15, జనవరి 25 తేదీల్లో రెండుసార్లు వార్తాపత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు.
ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన చేస్తామని, మార్చి 14 లోపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా పై అభ్యంతరాల స్వీకరిస్తామని, మార్చి 29 లోపు సదర అభ్యంతరాలను పరిష్కరించే ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అర్.డి. ఓ రమాదేవి, మాస్టర్ ట్రైనర్లు జిల్లా ఫిషరీస్ అధికారి అవినాష్, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, ఈ డీ ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, 7 మండలాల తాసిల్దార్లు , డీటీలు సంబంధిత అధికారులు తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.