పారిశుధ్య లోపం.. ప్రజలకు శాపం
◆:- కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలు
◆:- పర్యవేక్షణ లోపంతో నిత్యం ప్రజల అవస్థలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో
ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.
అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.
దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.
కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.