వైద్యం అందించి అడవిలో వదిలేసిన అటవీ అధికారులు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి ఆదివారం రోజున దారి తప్పి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు తరుముతుండగా గ్రామస్తులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకే వెళ్తే… ముదిగుంట గ్రామ శివారులో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టి.జి.ఎఫ్.డి.సి) కి చెందిన నీలగిరి ప్లాంటేషన్ లలో సంచరించే చుక్కల దుప్పిని చూసిన కుక్కలు వెంట పడ్డాయి.వాటి బారి నుంచి తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న ముదికుంట గ్రామం నుంచి పరిగెడుతూ దుప్పి స్పృహ తప్పి పడిపోయింది. దీనిని గమనించిన గ్రామస్తులు కొందరు దుప్పి వెంట పరిగెడుతూ వచ్చిన కుక్కలను తరిమివేసి ఆ దుప్పి ని రక్షించారు. గ్రామస్తులు ఆ దుప్పిని పట్టుకొని నీరు తాగించి స్థానిక ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్ కు సమాచారం ఇచ్చారు. వాచర్ ద్వారా సమాచారం తెలిసిన వెంటనే అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని దుప్పిని గ్రామస్థుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.కుక్కల దాడి నుంచి తప్పించుకున్నప్పటికీ గ్రామంలో ఒక చోట ఫెన్సింగ్ తీగల మీద నుంచి దూకి రావడం తో దుప్పికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వెంటనే దానిని జైపూర్ మండల కేంద్రం లోని పశువుల ఆసుపత్రికి తీసికెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ అటవీ సెక్షన్ అధికారి సి.రేపతి,బీట్ అధికారి సంతోష్, గ్రామస్తుల సమక్షంలో పంచనామా చేసారు. ప్రథమ చికిత్స అనంతరం కోలుకోవడం తో ఆ దుప్పిని జైపూర్ రక్షిత అటవీ ప్రాంతం లో వదిలివేశారు. ఈ సందర్బంగా దుప్పిని రక్షించిన ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్ తో పాటు ముదికుంట గ్రామస్తులు నాగపురి రాములు,దాసరి లవన్,సారంపల్లి రాజయ్య,పట్టెం రాజన్న,పట్టెం బన్నీ,పసులోటి రాజ్ కుమార్,పసులోటి సతీష్ పసులోటి అభి లను ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, సెక్షన్ అధికారి సి. రేపతి, బీట్ అధికారి సంతోష్ లు అభినందించారు.