
పశు వైద్యశాల ఏర్పాటు చేయాలి…
పశువులకు ఆసుపత్రి లేక సకాలంలో అందని వైద్య సేవలు…
నేటి ధాత్రి -గార్ల
మహబూబాబాద్ జిల్లా,గార్ల మండల పరిధిలోని చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ సమీపంలో పశు వైద్య శాల ఏర్పాటు చేసి, పశువులకు సకాలంలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ముల్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలోని,ముల్కనూర్ గ్రామంలో పశు వైద్యశాల ఉన్నప్పటికీ చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ ప్రజలకు దూరం కావడంతో పశువులకు సకాలంలో వైద్యం అందడం లేదని అంటున్నారు. చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలో పశు వైద్యశాల లేక పశువులకు ప్రయివేటు వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.పశువైద్యశాల ఏర్పాటు చేస్తే చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండ, మంగళితండ, ఎస్ టీ కాలనీ, సర్వన్ తండ రైతులకు అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తెల్ల పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పెరటి కోళ్లకు మందులను అందుబాటులో ఉంచి వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాల ఏర్పాటు చేసి అవసరం మేర వైద్యులు, స్టాఫ్ ను నియమించి, మందులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాలలో గాజుగుడ్డ, సిరంజీలు, కుక్కలకు సంబంధించిన యాంటీ రేబిస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని, పశువైద్యశాల ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.