కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ లోని హెలిప్యాడ్ వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఘన స్వాగతం పలికారు. మంత్రులను శాలువాలతో సత్కరించారు. అనంతరం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో జరిగిన గ్రామసభకు మంత్రులతోపాటు రాజేందర్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి నాలుగు పథకాలను ప్రారంభించుకోవడం ఏరాష్ట్రంలోనూ జరగలేదన్నారు. నాడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నదని చెప్పారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నేండు వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు రైతులకు ఏటా పన్నేండు వేల రూపాయలను రైతు భరోసా కింద అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వెలిచాల రాజేందర్ రావ్ సూచించారు. అర్హులైన పేదలందరికీ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.