అనిత..ద హోం మినిస్టర్‌!

https://epaper.netidhatri.com/view/295/netidhathri-e-paper-16th-june-2024%09/2

`పంతం నెగ్గింది…కలగన్నట్లే హోం మంత్రి పదవి వచ్చింది.

`పదేళ్ల క్రితం టీచర్‌.

 

`రాజకీయాలలోకి 2014 లో రాకెట్‌ లా దూసుకొచ్చారు.

`మొదటి సారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

 

`అవమానం పొందిన చోటే మర్యాదలు పొందుతున్నారు.

`అడ్డుకున్న చోటే అధికారం చెలాయిస్తున్నారు.

`కాలానికే సమాధానం చెబుతున్నారు.

`ప్రతిపక్షంలో వుండి వైసిపిని చెడుగుడు ఆడుకున్నారు.

`ఇప్పుడు వైసిపి అంతు చూసే పనిలో వున్నారు.

`వైసిపి నేతలను శంకరగిరి మాణ్యాలు పట్టించనున్నారు.

`టిడిపి పోలిట్‌ బ్యూరో మెంబరయ్యారు.

`తెలుగు మహిళా అధ్యక్షురాలయ్యారు.

`ఇప్పుడు మళ్ళీ రెండో ఎమ్మెల్యేగా గెలిచారు.

`ఆ వెంటనే అనే నేను…అని మంత్రిగా ప్రమాణం చేశారు.

 ఇప్పుడు మళ్లీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు

ఆ వెంటనే “అనిత అనే నేను”.. అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కష్టే ఫలి అనే పదానికి ఆమె నిర్వచనం. ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యం నెరవేరడానికి ఆమె పడిన శ్రమ రాజకీయంగా ఎదగాలనుకునే యువతకు ఆదర్శం. ఉన్నత విలువలకు ఆమె వ్యక్తిత్వం నిదర్శనం. ప్రజా సేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు అంకితం చేయడం ఆమె నిబద్ధతకు తార్కాణం. ఎన్ని కష్టాలొచ్చినా, రాజకీయంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చినా చెక్కు చెదరని ఆమె గుండె ధైర్యం ఒక రాజకీయ సందర్భం. మొక్కవోని దీక్షా, పట్డుదలలు ఆమెకు ఆభరణం. అందుకే విజయం ఆమె ఒడి చేరింది. గెలుపు ఆమెను విజయ తీరాలకు చేర్చింది. రాజకీయ ప్రయాణంలో ఆమె ఉన్నత స్థానంలో నిలిచింది. మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికైనా మంత్రి పదవి ఆమె వరించింది. అదృష్టం అండగా నిలిచింది. అవకాశం తోడుగా వచ్చింది. పోరాటం అభయమిచ్చింది. ఉద్యమం రాజకీయ జీవితానికి ఊపిరినిచ్చింది. తెగింపు గెలుపు బాట వేసింది. ధైర్యం ప్రజల మెప్పు సాధించింది. అహంకారం ఆమె ముందు తలదించుకున్నది. ఆధిపత్యం ఆమెకు దాసోహమన్నది. కాలం గిర్రున తిరిగే సరికి రాజకీయాలలో ఆమెను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. హోం మంత్రిగా వంగలపూడి అనిత అనే నేను అని పోలీసు బాస్‌ను చేసింది.

సరిగ్గా పది సంవత్సరాల క్రితం వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు.

ఆమె రాజకీయాలలోకి వస్తారని ఆమెకే తెలియదు. ఉపాధ్యాయ ఉద్యోగం వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరిందో తెలియదు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని రాజకీయాలలోకి ఎవరూ రారు. అవకాశాలు కలిసి వస్తే తప్ప, ఉద్యోగం వదులుకొని పోరాటం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ వంగలపూడి అనిత వచ్చారు. వస్తూ వస్తూనే విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019 కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పదేళ్ల తర్వాత మళ్ళీ పాయకరావుపేట నుంచి పోటీ చేసి రెండో సారి విజయం సాధించారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొలువులో హోం మంత్రి అయ్యారు. రాజకీయాలలో అదృవంతులు కొందరుంటారు. రాజకీయం కొత్తగా చేస్తారు. పోరాటం అందరికన్నా గొప్పగా చేస్తారు. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో పాయకరావుపేట పేట ఎమ్మెల్యే, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒకరు. ఆమె ఒక ఫైర్‌ బ్రాండ్‌. తెలుగు దేశం పార్టీలో అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు పొందిన మహిళా నేత. చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాధాన్యత దక్కించుకున్న నాయకురాలు. ఒక దశలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎంతో మంది నాయకులు తటపటాయిస్తుంటే ధైర్యంగా మాట్లాడిన నాయకురాలు. జగన్‌ మీద యుద్ధం చేసిన నాయకురాలు. నిత్యం తెలుగు దేశం పార్టీ తరఫున ఐదేళ్ళు నిరంతరం పోరాటం చేసిన నాయకురాలు. అసలు టిడిపి పరిస్థితి 2024 ఎన్నికలలో ఎలా వుంటుందో అని అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్న సమయంలో బరిగీసి నిలిచిన నాయకురాలు. అప్పటి మంత్రులను తూర్పార పట్టడమే కాదు…నాకూ అవకాశం వస్తుంది. అప్పుడు ఒక్కొక్కరి తాట తీస్తా అంటూ శపథం చేశారు. తాను అనేక సార్లు జగన్‌ ప్రభుత్వం చేసిన అక్రమాలపై, వైసిపి నాయకుల అరాచకాలపై పిర్యాదులు చేయడానికి వెళ్లినప్పుడు కనీసం కార్యాలయం మెట్లు కూడా ఎక్కనీయలేదు. ఫిర్యాదులు కూడా తీసుకునేవారు కాదు. ఆ రోజే శఫథం చేసింది. ఏ అధికారం చూసుకొని పోలీసులు అడ్డుకుంటున్నారో అదే అధికారంతో డిజిపి ఆఫీసుకు వస్తా…ఏ చేతులతో నైతే నన్ను నెట్టివేశారో అదే చేతులతో సెల్యూట్‌ చేయించుకుంటా…ఏ డిజిపి కార్యాలయం మెట్లు ఎక్కకుండా అడ్డుకున్నారో అదే కార్యాలయంలోకి మర్యాదలతో తీసుకెళ్ళే రోజు వస్తా! అని కాకతాళీయంగా అన్నారో..ఆవేశంతో అన్నారో, రాజకీయంగా అనాలని అన్నారో గాని అనిత అన్న మాటలు నిజమయ్యాయి. అప్పుడే తదాస్థు దేవతలు దీవించారు. అన్నట్లుగానే హోం మంత్రి అయ్యారు. నిజంగా ఇది ఊహించని పరిణామం. 2019 ఎన్నికలలో కొవ్వూరు నుంచి పోటీ చేసిన అనిత, వైసిపి నాయకురాలు వనిత చేతిలో ఓడిపోయారు. వనిత వైసిపి ప్రభుత్వంలో హోం మంత్రి అయ్యారు. వనిత తర్వాత హోం మంత్రి అనిత అని అప్పట్లోనే అన్నవారు కూడా వున్నారు. అది కూడా నిజమైంది. కాకపోతే ఈసారి హోం మంత్రి అనిత కొవ్వూరు నుంచి కాకుండా పాయకరావుపేట పేట నుంచి పోటీ చేసి గెలిచారు. అందరూ అన్నట్లే 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు. హోం మంత్రి అయ్యారు. తదాస్థు దేవతలు దీవించారు. ప్రజలు శాసన సభ్యురాలిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొలువులో మంత్రిని చేశారు. ఇక తన పాలన ఎలా ఉంటుందో వైసిపికి చూపించేందుకు అనిత తయారుగా వున్నార్‌. ఆల్‌ ది బెస్ట్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!