Sardar Patel’s Legacy Honored in Unity March
దేశ ఐక్యతకు వల్లభాయ్ పటేల్ విశేష కృషి
రాబోయే తరాల్లో ఇదే స్ఫూర్తి కొనసాగాలి
అన్ని రంగాల్లో దేశ అభివృద్ధి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
యూనిటీ మార్చ్, నషా ముక్త్ భారత్ కార్యక్రమాలు
హాజరైన ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతే
సిరిసిల్ల(నేటి ధాత్రి ):
దేశ ఐక్యతకు మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకొని* యూనిటీ మార్చ్, నషా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద, కొత్త చెరువు వద్ద జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు.
ముందుగా మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్సీ,
విద్యాలయాల విద్యార్థులు, ఎన్ సీ సీ, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో కొత్త చెరువు వద్దకు యూనిటీ మార్చ్ లో భాగంగా తరలివెళ్లారు. కొత్త చెరువు పార్కులో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమం వద్ద నషా ముక్త్ భారత్ పై సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ద్వారా ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 500 లకు పైగా ఉన్న సంస్థానలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేసి, దేశ ఐక్యతకు కృషి చేశారని కొనియాడారు. నిజాం ప్రాంతాన్ని దేశంలో కలిపారని గుర్తు చేశారు. పటేల్ స్పూర్తితో యువత దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వికసిత్ భారత్ – 2047 లో భాగంగా అన్ని రంగాలను ప్రధాని వృద్ధిలోకి తీసుకువెళ్తున్నారని తెలిపారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపు ఇచ్చారు. దేశంలో 5కోట్ల 70 లక్షల మంది డ్రగ్స్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు.
ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి మాట్లాడారు. దేశ ఐక్యత, అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. పటేల్ కృషితోనే దేశంలో వివిధ సంస్థానాలు కలిశాయని వివరించారు.
వివిధ శాఖల సమన్వయంతో డ్రగ్స్ రహిత జిల్లాకు కృషి
విద్యాశాఖ, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, జిల్లా సంక్షేమ శాఖ, పోలీసుల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. డ్రగ్స్ తో కలిగే నష్టాలు ఇబ్బందులపై అవగాహన కలిగించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. దేశ ఐక్యత, అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను కొనియాడారు.
సమాచారం ఇవ్వాలి
జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్న సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ మహేష్ బి గితే పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లా కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని తెలిపారు.
వైద్య కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఏమీ కావాలో తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫ్లాష్ మాబ్ ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎన్ వై కే కో ఆర్డినేటర్ రాంబాబు,
డీవైఎస్ఓ రాందాస్, డీఐఈఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
