ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.
పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకే అధినాయకత్వంపై ఆరోపణలు.
ఎంసిపిఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ వెల్లడి.
నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి మద్దికాయల ఓంకార్,బి.ఎన్. రెడ్డిల పేర్లను ఉపయోగిస్తూ పార్టీ బహిష్కృత ఆరాచకవాదులు ఎంసిపిఐ పేరుతో చేస్తున్న అరాచక ఆగడాల పట్ల ఉపేక్షించేదిలేదని ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ హెచ్చరించారు.పట్టణం లోని పార్టీ కార్యాలయం ఓంకార్ భవన్ లో పార్టీ సీనియర్ నాయకులు నాగెల్లి కొమురయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.రాజాసాహెబ్ మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్ది కాయల ఓంకార్ నాయకత్వంలో 1984 నుండి 2006 మధ్యకాలంలో మొదటగా ఎంసిపిగా వరంగల్ జిల్లాలో నర్సంపేట కేంద్రంగా ఏర్పడి, అనతి కాలంలోనే ఓంకార్ ఉద్యమ సహచరులతో కలసి ఎంసిపిఐ గా దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేయడంలో అసెంబ్లీ టైగర్ ఓంకార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు. సైదాంతిక విభేదాలతో చీలిన కమ్యూనిస్టు నాయకులను ఏకం చేసి వామపక్ష ఉద్యమాలను దేశంలో బలోపేతం చేయడానికి పార్టీ చివరన యూనిటీ అనే పదాన్ని జోడించారని, దీనిని పార్టీ నుండి బహిష్కరణకు గురైన పానుగంటి నర్సయ్య,సింగతి సాంబయ్య, మొగిలిచర్ల సందీప్ తదితరులు ఆర్థిక అరాచవాదులు పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పార్టీ అధినాయకత్వంపై ఎంసిపిఐ పేరుతో నర్సంపేటలో ఏకమై తీవ్రమైన ఆరోపణలు చేయడం వారి దివాలాకోరు రాజకీయ రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు.ఓంకార్, బి ఎన్ రెడ్డి ల పేర్లను వాడే నైతిక హక్కు వారికి లేదని,ఆ మహానుభావుల నిజమైన వారసులు ఎవరనేది సరైన సమయంలో సరైన గుణపాఠం ప్రజలే చెబుతారని తెలిపారు.అందుకు ఓంకార్, బి ఎన్ రెడ్డిల నిజమైన వారసులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికీ చాలా ఓపికగా పార్టీ శ్రేణులు ఉన్నాయని, త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీని, పార్టీ నాయకత్వాన్ని అసత్య ఆరోపణలతో ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో శిక్షలు తప్పవని రాజా సాహెబ్ హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, మండల కార్యదర్శులు సింగతి మల్లికార్జున్, కలకొట్ల యాదగిరి, దామ సాంబయ్య, మార్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.