మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,
కేసముద్రం/ నేటి దాత్రి
రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని జనవిజ్ఞాన వేదిక కేసముద్రం మండల అధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్, ప్రధాన కార్యదర్శి బండారు నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.
వారు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్( పి ఓ పి) విగ్రహాలను నదులు, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఆ విగ్రహాల్లో వాడే కెమికల్ రంగులు నీటిని కలుషితం చేసి, చేపలు మరియు జలచరాల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నాయి. చివరికి ఇది మనిషి ఆరోగ్యానికే హానికరమవుతోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మట్టితో తయారు చేసిన విగ్రహాల ప్రాముఖ్యతను వివరించారు. మట్టి విగ్రహాలు నీటిలో కరిగిపోవడం వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదని, మట్టి తిరిగి నేలలో కలిసిపోయి భూమి సారాన్ని పెంచుతుందని తెలిపారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఇది ఉపయోగకరమని, స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మట్టి విగ్రహాల వాడకం సహకరిస్తుందని అన్నారు.
ప్రజలందరూ పర్యావరణ హిత దృక్పథంతో ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలనీ, శుభ్రమైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో భాగస్వాములు కావాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు పిలుపునిచ్చారు.