
ఊర్వశి, జోజు జార్జ్ జంటగా కొత్త సినిమా
సీనియర్ నటీనటులు ఊర్వశి, జోజు జార్జ్ జంటగా మొదలైన కొత్త సినిమాకు ‘ఆశ’ అనే పేరు ఖరారు చేశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది
మలయాళ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులు ఊర్వశి (Urvashi), జోజు జార్జ్ (Joju George) కలిసి క్రేజీ మల్టీ లింగ్వల్ మూవీలో నటిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఆ సినిమా ‘ఆశ’ (Aasha) అనే పేరు పెట్టారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో, వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సఫర్ సనల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ సంయుక్తంగా దీనికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు.
త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంతో ‘ఆశ’ చిత్రం ప్రారంభమైంది. జోజు జార్జ్, సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్, దర్శకుడు సఫర్ సనల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా, మధు నీలకందన్ కెమరా స్విచ్ – ఆన్ చేశారు. ఈ వేడుకలో ఆశ టైటిల్ – లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఇది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం అదే రోజు మొదలైంది. విజయ రాఘవన్, ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi), ‘పాణి’ ఫేమ్ రమేష్ గిరిజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆశ’ ఐదు భారతీయ భాషల్లో పాన్ – ఇండియన్ మూవీగా విడుదల కానుంది. ఈ సినిమాకు మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు.