యూరియా కొరతపై రైతుల ఆందోళన..
రామాయంపేట సెప్టెంబర్ 8 నేటి ధాత్రి (మెదక్)
చేగుంట మండలంలో యూరియా కొరత రైతులను రోడ్డెక్కేలా చేసింది. మూడు రోజులుగా ఎరువులు అందకపోవడంతో సోమవారం చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఇటీవల 440 బస్తాల యూరియా మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు పంపిణీ జరిగి, మిగతా వారికి అందలేదు. ఈరోజు యూరియా వస్తుందని తెలిసి తెల్లవారుజామున మూడు గంటలకే రైతులు రైతు వేదిక వద్దకు చేరుకున్నారు.
అయితే యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన వారు ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరగంట పాటు సాగిన రాస్తారోకోతో మెదక్–హైదరాబాద్, నిజామాబాద్ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి మంగళవారం యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.