బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం ముష్టి వేసినట్లు 3.6 శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన ఈ బడ్జెట్ బీసీలకు ఏ విధంగా..ఏ మేరకు..ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చెప్పాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసిన మీరు..బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని..ఇది వివక్షత కాదా..? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడ్జెట్ ను సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.