హన్మకొండలో ఒక విద్యాసంస్థలో గిరిజన విద్యార్థిని ఆత్మహత్య గొప్ప ఉదాహరణ
ఒత్తిడిని పెంచే విద్య వికాసానికి దోహదం చేయదు
పోటీ పరీక్షల కోచింగ్ పేరుతో వేలం వెర్రి పోకడలు
చెడ్డు చెడే కాలానికి కుక్కమూతి పిందెల చందం
మన విద్య ఎటువైపు పోతున్నది?
నరకానికి దారితీస్తున్న ప్రైవేటు విద్య
కట్టడిలేకపోతే పుట్టుకొచ్చేది చేవలేని తరం మాత్రమే
సామాజిక అవగాహన లేని విద్య అనర్థం
ర్యాంకు తాత్కాలికం, వికాసం శాశ్వతం
ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ లేకపోవడం వల్ల జరిగే అనర్థాలకు ఉదాహరణగా హన్మ కొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఒక గిరిజన విద్యార్థిని మృతి నిలిచింది. ఆత్మహత్మ గా యాజమాన్యం చెబుతోంది. అయితే యువమోర్చా సభ్యులు మాత్రం కళాశాల యాజమాన్యం పెట్టిన టార్చర్ భరించలేకే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులు ఏవిధ మైన పంచనామా జరుపకుండా ఏకంగా ఎం.జి.ఎం. మార్చురీకి ఏవిధంగా చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు పిల్లల తల్లి దండ్రులనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే కాకుండా, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలుగజేస్తున్నాయన్నది మాత్రం సత్యం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతే ఇది. కానీ విద్య కా ర్పొరేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కిమ్మనడంలేదు. విద్యాసంస్థల యజమానులు ఒక దశకు చేరుకొని వివిధ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ సంస్థల్లో జరుగుతున్న కార్యకలాపాలను బయటకురాకుండా వుండేందుకు, మీడియా, అధికార్లు, పోలీసులను గుప్పిట్లో పెట్టు కొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మీడియా ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. ఈ నేపథ్యంలో ప్రధాన స్రవంతి మీడియాకు కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలను ఏటా ఇస్తూ, తమ సంస్థల్లో జరిగే అవకవకలు ప్రచురణ లేదా ప్రసారం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అంతేకాదు పోలీసుల్లో అవినీతి అధికారులకు, ఇతర సంబంధిత ప్రభుత్వ అధికార్లకు కూడా తగినంత ముట్టజెప్పి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాదు, విద్యార్థులపై చదువు పేరుతో విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్ల దీన్ని తట్టుకోలేని విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడు తున్నారన్నది ప్రధానంగా వస్తున్న అభియోగం.
ఈ విద్యాసంస్థలు దోపిడీ ఒకరకంగా వుండదు! ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ దోపిడీ అనాలి. అడ్మిషన్ల దగ్గరినుంచి, పుస్తకాలు, స్పెషల్ ఫీజులు, యూనిఫామ్‌లు…ఈవిధంగా వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రులనుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తాయి. అదేమంటే విద్యాసంస్థ నిర్వహణకు ఇవన్నీ అవసరమన్న ధోరణి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాల విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి నశించి, తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆశలతో ఉన్న ఆస్తులను కూడా ఖాతరు చేయకుండా తమ పిల్లల చదువుకోసం ఖర్చు చేయడానికి వెనుకాడటంలేదు. ప్రైవేటు విద్యావ్యాప్తికి ప్రధాన కారణం ఈవిధమైన తల్లిదండ్రుల బలహీనతే. గతంలోని తరాల్లో ప్రైవేటు స్కూళ్లు లేవు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. మాతృభాషలో విద్యను అభ్యసించి, పైచదువులు చదివి గొప్ప స్థానాలు పొందినవారెందరు లేరు? కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లున్నా నాణ్యమైన విద్య అందడంలేదన్న కారణంగా తల్లిదండ్రులు ప్రైవేటు విద్యను ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి?
తల్లిదండ్రులకు తమ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారన్న విషయం కేవలం వారికి వచ్చే మా ర్కుల సరళిని బట్టే తెలుస్తుంది. చాలా ప్రైవేటు స్కూళలో విద్యార్థికి ఎక్కువ మార్కులు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులను బురిడీ కొట్టించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే డిటెన్షన్ విధానం అమల్లో లేకపోవడంల్ల పదోతరగతికి వచ్చేవరకు ప్రశాంతంగా వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి విద్యార్థులపై వత్తిడి పెరుగుతుంది. ఇంటర్‌లో ఎంసెట్, ఈసెట్, జెఈఈ వంటి పోటీపరీక్షలకు హాజరు కావాల్సి వుండటంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనికితోడు ఆయా ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాంకులకోసం టార్చర్ పెట్టడం ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.
విచిత్రమేమంటే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలు కలిగిన విద్యాసంస్థల యాజమాన్యాలు, రాజకీ యంగా, మీడియా, అవినీతి అధికార్లు, పోలీసులతో కుమ్మక్కయి అసలు తమ విద్యాసంస్థలో ఏం జరుగుతున్నదీ బయటకు వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. గతంలో విద్యాసంస్థ యాజమాన్యాలు, ఏవైనా అవకతవకలు బయటపడినప్పుడో లేదా ఆత్మహత్యల వంటి సంఘటన జరిగినప్పుడో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికార్లకు ఏదోవిధంగా ముట్టజెప్పి బయటపడటం జరిగేది. వీరి పలుకుబడి నేపథ్యంలో నిరుపేదలైన తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని, పిల్లలను కోల్పోయి ప్రశ్నించలేని దుస్థితిని ఎదుర్కొనడాన్ని మించిన దురదృష్టం మరోటుండదు. మీడియాను ప్రకటనటల ద్వారా తమదారికి తెచ్చుకుంటున్న యాజమాన్యాలు, అవినీతి పోలీసులు, అధికార్లకు అవసరమైనంత ముట్టజెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ పాఠశాల యాజమాన్యాల్లో కొందరు వివిధ రాజకీయ పార్టీ లకు కొమ్ము కాయడం ద్వారా పబ్బం గడుపుకుంటుంటారు. మరికొందరు పార్టీలకు పార్టీఫండ్ లను సమకూర్చడం ద్వారా కూడా తమపై ఈగవాలకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇంకా పై స్థాయికి చేరుకున్న వారు, ఏకంగా రాజకీయాల్లోకే ప్రవేశిస్తారు. ఆవిధంగా అధికారం చేతిలోవుంటే అన్నీ వాటికవే చక్కబడిపోతాయన్న సత్యం వారికి బాగా అవ గాహన అయినప్పటికీ, ఆ స్థాయికిచేరుకోవడానికి వారికి కొంత సమయం అవసరం. ఇప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన ఒక వి ద్యాసంస్థల యజమాని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తు న్నారు. ఎవరైనా ఏరంగంలోనైనా ఎదగాలనుకోవడంలో తప్పులేదు. కానీ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజకీయాన్ని ఉపయోగించే విధానమే ఇక్కడ తప్పు!
ఇదిలావుండగా ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం ర్యాంకులపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల విద్యా ర్థులకు వారివారి స్థాయికి తగిన సాధారణ పరిజ్ఞానం కొరవడుతోంది. జ్ఞాపకశక్తిపైనే దృష్టి తప్ప సృజనాత్మకతకు చోటుండటంలేదు. ఒకప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పాఠశాల స్థాయినుంచే సివిల్ సర్వీస్ వంటి అత్యుతన్న పోటీపరీక్షలకు అవసరమైన ప్రమాణాలతో విద్యాబోధన అంటూ కొత్త ప్రచారాలు మొదలయ్యాయి. అసలు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థుల అవగాహనా శక్తి ఎంత? అనేది పట్టించుకునే దిక్కే లేదు. వేలంవెర్రిగా కోర్సులు పెట్టడం, తల్లిదండ్రులు అనుసరించడం. ఈవిధంగా విద్య వ్యాపార స్థాయినుంచి, కార్పొరేట్ స్థాయిని కూడా దాటిపోయిందనుకోవాలి. ఇక పిల్లల భవిష్యత్తేమిటి? వారి జీవితంలో చదువు, ర్యాంకులు, పోటీలు తప్ప ఆటలు, వినోద కార్యక్రమాలకు అవకాశమే లేని జైలు జీవితాన్ని ప్రైవేటు విద్యావిధానం వారికి అందిస్తోంది. నిజంగా ఇది చాలా దారుణం. జీవితంలో అత్యంత ఆనందమయంగా పరిగణించే బాల్యం, చదువును బోధన పేరుతో ఒక పెద్ద ‘సంకెల’గా మార్చివేశారు. ఇక్కడ తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లలకు జైలు జీవితానికి పరిమితం చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో శారీరక స మతుల్యాభివృద్ధి దెబ్బతింటోంది. వత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే బైటికి రాకుండా డబ్బుతో అందరినీ కట్టిపడేస్తున్నారు. అందమైన భవిష్యత్తంటూ రంగురంగుల మాయా ప్రపంచాన్ని చూపుతూ పిల్లల్ని చదువు చట్రంలో విద్యార్థులను బిగించి ప్రైవేటు విద్యాసంస్థలు ఊపిరాడ కుండా చేస్తున్నాయి.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏ చిన్న పొరపాటు లేదా సంఘటన జరిగినా మీడియా, వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా వాలిపోతారు. నానా యాగీ చేస్తారు. ఇదే ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ఒక్కరు మాట్లాడరు!! ఇదెక్కడి దారుణం! అంతేకాదు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రభుత్వ విద్యపై ఎన్నిరకాలుగా దుష్ప్రచారం చేయాలో అన్నిర రకాలుగా చేస్తారు. కారణం ప్రభుత్వ విద్యాసంస్థలు ఖాళీ అయితేనే కదా, ప్రవేటు సంస్థలు కళకళలాడేది!! ఇందులో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్రకూడా విస్మరించలేం. వీరిలో కొందరు ప్రవేటు విద్యాసంస్థలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లల్లో మనోవికాసం పెరగకపోవడానికి ప్రైవేటు విద్యే ప్రధాన కారణం! విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల, కళాశాలల వాతావరణం దోహదం చేయాలి తప్ప, ఒక మూస విధా నంతో విపరీతమైన ఒత్తిడిని పెంచుతూ, చివరకు వారి ఆత్మహత్యలకు దోహదం చేసిదిగా విద్య వుండకూడదు!