TSJU Leads Road Safety Awareness Rally in Warangal
సమాజ చైతన్యంలో టి.ఎస్.జె.యు పాత్ర అభినందనీయం
– జిల్లా కలెక్టర్ సత్య శారద
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
వరంగల్, నేటిధాత్రి.
సమాజాన్ని చైతన్యపరచడంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టి ఎస్ జె యు) పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణలో టి ఎస్ జె యు ఇతర యూనియన్లకు ఆదర్శంగా నిలుస్తోందని ఆమె కొనియాడారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా టి ఎస్ జె యు ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. టి ఎస్ జె యు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగోని ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కందికొండ మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వరంగల్ డీటీఓ శోభన్, ట్రాఫిక్ సీఐ సుజాత, జాతీయ యువజన అవార్డు గ్రహీత సామాజికవేత్త మండల పరశురాములు, వరంగల్ ఎంఆర్వో శ్రీకాంత్, ఎన్సీసీ అధికారి కెప్టెన్ సతీష్, ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ మాట్టేవాడ సీఐ కర్ణాకర్, ఎస్సైలు సందీప్, వెంకటేశ్వర్లు, రవికిరణ్, కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని, రోడ్డును దాటేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల స్వయంగా ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. ప్రజల భద్రత కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ డీటీఓ శోభన్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోందని అన్నారు.
ట్రాఫిక్ సీఐ సుజాత, ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని సూచించారు.
ఈ ర్యాలీలో కార్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టి ఎస్ జె యు రాష్ట్ర నాయకులు తోకల అనిల్, నాగపురి నాగరాజు, నరేష్, వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఆవునూరి కుమార్, కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ఈద శ్రీనాథ్, అడుప అశోక్, నాగపూరి అవినాష్, కౌడగాని మోహన్, నీరుటి శ్రీహరి, మంతెన సురేష్, రావుల నరేష్, 28వ డివిజన్ అధ్యక్షుడు సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మోటివేటర్ బరుపాటి గోపి, సికేఏం కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, ధ్రువ, పద్మావతి కళాశాలల ఎన్సీసీ విద్యార్థినులు
తదితరులు పాల్గొన్నారు.
