
వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్.. ఆ డీల్‌ను ఆహ్వానించిన జపాన్ ప్రధాని
జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరిగినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం(Trade Deal) జరిగినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌తో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని కూడా ట్రంప్ ప్రకటించారు. జపాన్ టారిఫ్ రేట్‌ను 15 శాతానికే ఫిక్స్ చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో ఈ రేట్ అత్యంత కనిష్టమైంది. జపాన్ వాహనాలపై విధిస్తున్న రేట్‌ను 25 శాతానికి పెంచాలనుకున్నారు, కానీ దాన్ని 15 శాతానికే కుదించినట్లు జపాన్ ప్రధాని ఇషిబా తెలిపారు. జపనీస్ వైపు పన్ను శాతం తగ్గినట్లు ఎటువంటి ప్రకటన జరగలేదు. బలమైన రీతిలో లాబీయింగ్ చేయడం వల్లే అమెరికా తమపై పన్నులను భారీగా వసూల్ చేయడం లేదని జపాన్ ప్రధాని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్‌హౌజ్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో టారిఫ్‌ల కన్నా ఇన్వెస్ట్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ వరకు డీల్ కుదుర్చుకోకుంటే, వాణిజ్య పన్నులను పెంచనున్నట్లు ట్రంప్ హెచ్చరిక ఇచ్చిన నేపథ్యంలో కొన్ని దేశాలు ఆ ఒప్పందానికి రెఢీ అయ్యాయి. డీల్‌కు చెందిన వివరాలను శ్వేతసౌధం ఇంకా రిలీజ్ చేయలేదు.
చరిత్రలో అతిపెద్ద వాణిజ్యం ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు. జపాన్‌తో జరిగిన అతిపెద్ద డీల్ ఇదే అని ఆయన వెల్లడించారు. ట్రుత్ సోషల్‌లో ఆయన దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికాలో సుమారు 550 బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి జపాన్ సిద్ధంగా ఉంది. అలాగే 15 శాతం దిగుమతి సుంకాన్ని కూడా చెల్లించేందుకు జపాన్ అంగీకరించింది.
ఫిలిప్పీన్స్ ఉత్పత్తులపై 19 శాతం పన్ను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడితో జరిగిన భేటీ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. కొత్త టారిఫ్ విధానంపై ట్రంప్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే అమెరికా వస్తువులపై విధించే సుంకాన్ని తగ్గించనున్నట్లు ఫిలిప్పీన్స్ తెలిపింది. ఇండోనేషియాకు చెందిన వస్తువులపై కూడా 19 శాతం పన్ను విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
ట్రంప్ ప్రకటనతో.. జపాన్‌లోని కార్ల కంపెనీల షేర్లు పెరిగిపోయాయి. జపాన్ కార్లపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో నిస్సాన్ షేర్లు పెరిగిపోయాయి. 8.5 శాతం షేర్లు పెరిగాయి. హోండా షేర్లు 11 శాతం, టొయోటా షేర్లు 14 శాతం వృద్ధి చూపించాయి. కొత్త అగ్రిమెంట్ ప్రకారం అమెరికా వాహనాలకు జపాన్‌లో ఎంట్రీ లభించనున్నది.