Tributes to senior journalist Arelli Narender
సీనియర్ జర్నలిస్ట్ ఆరెళ్లి నరేందర్ కి ఘన నివాళులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ ఆరెళ్లి నరేందర్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం జర్నలిజం రంగానికి తీరని లోటని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.
దశాబ్దాల పాటు జర్నలిజం రంగంలో సేవలందించిన నరేందర్ ప్రజా సమస్యలపై నిర్భయంగా కలం ఝళిపిస్తూ, నిజాయితీతో కూడిన పాత్రికేయుడిగా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, సమాజ హితమే ధ్యేయంగా జర్నలిజాన్ని వృత్తిగా కాక బాధ్యతగా నిర్వహించిన వ్యక్తిగా సమాజానికి నరేందర్ గుర్తుండిపోతారన్నారు.
నరేందర్ మృతి వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన అంత్యక్రియల్లో తెలంగాణ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత మదుసుదనాచారి పాల్గొని పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జర్నలిస్టు లోకానికి సంతోషకరంగా ఉందని తెలిపారు.
అంత్యక్రియల కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు, మిత్రులు పాల్గొని నరేందర్ జర్నలిజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరెళ్లి నరేందర్ గారు జర్నలిజం రంగానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
