ఏకమౌతున్న ద్రోహులు!

https://epaper.netidhatri.com/

`తెలంగాణ అస్తిత్వం మీద దండయాత్ర.

`ఎప్పటి నుంచో నేటిధాత్రి చెబుతూనే వుంది.

`పోటీకి తెలుగు దేశం దూరం.

`కాంగ్రెస్‌ తో లోపాయికారి ఒప్పందం.

`రేవంత్‌ రెడ్డి కోసం తెలుగు దేశం పార్టీ పణం.

`కాసానికి చంద్రబాబు ద్రోహం.

`రెండేళ్లుగా నమ్ముకున్న వాళ్లకు షర్మిల మోసం.

`షర్మల మళ్ళీ యూటర్న్‌.

`పోటీ చేయడం లేదని ప్రకటన తో సమాప్తం.

`కాంగ్రెస్‌ కు మద్దతు తో బైటపడిన బండారం.

`ఇప్పటికీ రెండు సార్లు నమ్మిన వారిని మోసం చేసిన షర్మిల.

`లోటస్‌ పాండ్‌ లో ఉద్రిక్తత.

`కాంగ్రెస్‌ కు మద్దతివ్వాలని చెప్పే హక్కు షర్మిలకు లేదు.

`వైఎస్‌ఆర్టిపీ శ్రేణులంతా బిఆర్‌ఎస్‌ కు మద్దతు తీర్మానం.

`తెరవెనుక మళ్ళీ చంద్రబాబు… కేవిపి.

`రేవంత్‌ రెడ్డి రూపంలో కాంగ్రెస్‌ ఖతం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ ద్రోహులంతా మళ్లీ ఏకమౌతున్నారు. చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ మీద దండయాత్రకు వస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా మళ్లీ తమ పెత్తనానికి పదునుపెట్టాలని చూస్తున్నారు. తెలంగాణను వారి గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తెలంగాణ మీద ఆధిపత్యం చేలాయించేందుకు కాచుకొని కూర్చున్నారు. ఎన్నికల వేళ మళ్లీ ఒకే వేధికను పంచుకోవాలని చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంల ఉప్పు,నిప్పులాగా వున్నవాళ్లు సైతం ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుంటున్నారు. రాజకీయంగా మేమంతా ఒకటే నిరూపిస్తున్నారు. ఈ విషయాన్ని నేటి ధాత్రి గత మూడు సంవత్సరాలుగా చెబుతూనే వుంది. రేవంత్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడైందే అందుకు అన్నది ఆనాటి నుంచి నేటిధాత్రి తెలంగాణ సమాజానికి వివరిస్తూనే వుంది. పైకి మాత్రమే రేవంత్‌రెడ్డి కనిపిపిస్తున్నాడు. రేవంత్‌రెడ్డి కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబు ఆడిరచే తోలుబొమ్మగా తెలంగాణలో రేవంత్‌ను ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ దుష్టపన్నాగం పన్నుతున్నాడని నేటిధాత్రి చెబుతూనేవుంది. సరిగ్గా గత ఎన్నికల ముందు కూడా ఇవే ఎత్తుగడలు వేశారు. 2014 ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన బిజేపిని కాదని, 2018 ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారు. అంటే ఎలాగైనా తెలంగాణ రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూశారు. కాని అప్పుడు పరిస్ధితులు అనుకూలించలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం మరింత గట్టిగా చేస్తున్నారు. అప్పుడు తెలంగాణలోని రాజకీయ ప్రతిపక్షాలను ఏకం చేయడానికి తెలంగాణలో చంద్రబాబుకు ఏజెంటు లేకుండాపోయారు. దాంతో ఈసారి చంద్రబాబు ముందుగానే పథకం రచించి రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపించారు. నిజానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, అనుచరులు తన పార్టీ ప్రజల్లో వుండాలని కోరుకుంటారు. తన పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు. తన పార్టీలో వున్న నాయకులు తమ పార్టీలోనే వుండాలని అనుకుంటారు. కాని రేవంత్‌ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపించారు. ఇక్కడే అసలు తిరకాసు వుందని ఆనాడే నేటి ధాత్రి చెప్పింది. సహజంగా ఏ నాయకుడైనా ఒకపార్టీ వదిలి మరో పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీపై ఏదో ఒక ప్రకటన చేయడం జరుగుతుంది. నిజానికి రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు కావాలనుకున్నాడు. కాని చంద్రబాబు ఎంతో చాకచక్యంగా రేవంత్‌చేతిలో తెలుగుదేశం పెట్టకుండా, కాంగ్రెస్‌లోకి పంపించాడు. తన చాణక్యాన్ని ఉపయోగించి కాంగ్రెస్‌కు నేతను చేశాడు.
తెలంగాణ రావడం చంద్రబాబుకు ఏనాడు ఇష్టం లేదు.
తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన వారిలో మొదటి వ్యక్తి చందబ్రాబు. రెండో వ్యక్తి రాజశేఖరెడ్డి. అప్పుడు విడివిడిగా తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు కలిసి తెలంగాణకు మళ్లీ పాత రోజులు తేవాలని చూస్తున్నాయి. తెలంగాణ బాగు పడడం చంద్రబాబుకు ఏనాడు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నంత కాలం ఆయన ఆలోచన, అమలు తీరు అంతా ఆంధ్రపైనే వుండేది. ఆయన ఏనాడు తెలంగాణ జిల్లాల్లో పర్యటనలు చేసింది లేదు. నిద్రలు చేసింది లేదు. ప్రజా సమస్యలు విన్నది లేదు. ప్రజల గోస చూసింది లేదు. తెలంగాణ సాగు అన్యాయమైపోతుందన్నా పట్టించుకోలేదు. తెలంగాణ రైతు చితికిపోతున్నా అయ్యే అనలేదు. తెలంగాణ సాగు నీరు లేక ఎండిపోతున్నా ఆదుకుందామన్న ఆలోచన చేయలేదు. ఆకాల వర్షాలకు పంటలు నష్టపోయినా సాయం చేయలేదు. ఇలా తెలంగాణను అన్ని రకాలుగా వివక్షకు గురిచేసిన నాయకుడు చంద్రబాబు. తెలంగాణ సాగుకు కరంటు బారం ఎక్కువౌతుందని విపరీతమైన చార్జీలు పెంచి రైతుల జీవితాలను చిదిమేసిన నాయకుడు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు తెలంగాణకు వున్న కిటికీలు లాగేస్తే, వైఎస్‌ రాజశేఖరెడ్డి తెలంగాణ దర్వాజలు కూడా లేకుండా చేశాడు. తెలంగాణ గూడు చిదిమేశాడు. తాను అధికారంలోకి వచ్చేందుకు వైఎస్‌ తెలంగాణను వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాక తాను తెలంగాణకు అడ్డం కాదు,నిలువు కాదంటూ తెలంగాణను అడ్డుకున్నాడు. తెలంగాణ వాదులను ఎగతాలి చేస్తూ ,తెలంగాణ వాదాన్ని ఎప్పటిప్పుడు కించపరుస్తూ వుండేవారు. తెలంగాణ వాదులను ఇబ్బందులకు గురిచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. తెలంగాణ వాదాన్ని లేకుండా చేయాలని శతవిధాల ప్రయత్నించారు. ఆఖరకు హరీష్‌రావు లాంటి వారిని కూడా అప్రదిష్టపాలు చేయాలని చూశాడు. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వాడకుండా నిషేదించారు. అలా చంద్రబాబు, వైఎస్‌ ఇద్దరూ తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వైఎస్‌ వారసురాలిగా నిన్నటిదాకా సమైక్యవాదం వినిపించి షర్మిల ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇక తానే సిఎం అంటూ లేనిపోని గొప్పలకు పోయింది. తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయాలని చూసింది. తెలంగాణకు పూర్తి వ్యతిరేకమైన వైఎస్‌ రాజశేరరెడ్డి పేరును మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చొప్పించాలని చూసింది. లేని రాజన్న రాజ్యం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసింది. కాని దాని వెనక ఏదో కుట్ర దాగి వుందని, ఎన్నికలనాడు మళ్లీ ఏదో గోల్‌మాల్‌ గోవిందం వుంటుందని కూడా ఆనాడే నేటిధాత్రి చెప్పింది. ఇప్పుడు అక్షరాల అదే నిజమైంది.
వైఎస్‌ వున్నంత కాలం తెలంగాణ సమాజాన్ని వంచించాడు.
ఆ రూపంలో వచ్చిన షర్మిల ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. తన స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణలోని ఎంతో మందిని నాయకులను చేస్తానని, నమ్మించి మోసం చేసింది. రాజకీయంగా ఏదో ఒక వేదిక కోసం ఎదురుచూస్తున్నఎంతో మంది షర్మిలను నమ్మి ఆ పార్టీలో చేరారు. రెండున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. పార్టీ కోసం సర్వస్వం దారపోశారు. ఆస్థులు అమ్ముకొని మరీ షర్మిల రాజకీయం కోసంపనిచేశారు. కాని గత రెండు నెలల క్రితం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి ఆ పార్టీలో వున్నవారందరినీ మోసం చేసింది. దాంతో పార్టీలో వున్న కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న లాంటి వారిని కూడా ఎంతో అలవోకగా నమ్మించి మోసం చేసింది. కాని రాజకీయం తిరగబడిరది. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్నామంటూ మళ్లీ ప్రకటన చేసింది. మళ్లీ ఎంతో మంది ఆశవహులు ఎన్నికల కోసం సిద్దమాయ్యరు. ఈ క్రమంలో ఎంతో ఖర్చు చేసుకున్నారు. కాని షర్మిల తాను కాంగ్రెస్‌ పార్టీకి సపోర్టు చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి వారిని నివ్వెరపోయేలా చేసింది. ఆమెను నమ్ముకున్న వారందరినీ నట్టెట్లో ముంచింది. ఒకనాడు కాంగ్రెస్‌ పార్టీని షర్మిల ఎంత తూర్పారపట్టాలో అంత పట్టింది. తన తండ్రి వైఎస్‌ మరణానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది. తన తండ్రి లేకుంటే కాంగ్రెస్‌పార్టీయే లేదన్నారు. తన అన్న జగన్‌ జీవితం జైలు పాలు కావడం కాంగ్రెస్‌ చేసిన పాపమన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ జపం చేస్తున్నారు. అయితే తెలంగాణలో తమ అభిమానులు కాంగ్రెస్‌కు సపోర్టు చేయాలని కోరడాన్ని షర్మిల పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. తామంతా బిఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతామమని వారు ప్రకటించారు. తెలంగాణ అస్ధిత్వం కోసం పనిచేస్తామని ప్రకటన కూడా చేశారు. బిఆర్‌ఎస్‌ గెలుపు కోసం ఇప్పటినుంచి పని చేస్తామన్నారు. షర్మిల తెలంగాణలో అడుగుపెట్టిన నాడు రేవంత్‌రెడ్డిని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. రేవంత్‌ పాదయాత్రను ఎగతాలి చేసింది. రేవంత్‌ యాత్ర పాదాల మీద సాగడం లేదన్నారు. ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డితో కూడా కలిసి పనిచేసేందుకు కూడా సిద్దమని ప్రకటించింది. అంటే తెలంగాణ మీద పెత్తనం కోసం ఎంతకైనా దిగజారడానికి తామంతా సిద్దమే అని మళ్లీ రుజువు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ లో వున్న 24 అసెంబ్లీ స్ధానాలలో తమ ప్రభావం వుంటుందని కమ్మ సామాజిక వర్గమంతా తెలుగుదేశం పార్టీ వైపే వుంటుందని, అది తెలంగాణలో కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడు శ్రీనివాస్‌ ప్రకటించడం జరిగింది. రేవంత్‌రెడ్డిని కలిసి సంఫీుబావం తెలపడం జరిగింది. అంటే సొంత పార్టీ బాగుపడడం కన్నా, తెలంగాణ నష్టపోవాలని చూసే చంద్రబాబు డైరెక్షన్‌లో రాజకీయాలను కలుషితం చేసేందుకు దుష్టులు వస్తున్నారు. తెలంగాణ ద్రోహలు బయలు దేరుతున్నారు. తెలంగాణ సమాజం మరోసారి అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడిరది. వారిని తరిమేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *