మియాపూర్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి….
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్త మహబూబ్‌పేట్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురువారం ఉదయం తెలుగులోకి వచ్చింది.
మృతులను ఉప్పరి లక్ష్మయ్య (60), ఆయన భార్య ఉప్పరి వెంకటమ్మ (55), కూతురు కవిత (24), అల్లుడు అనిల్ (32), రెండేళ్ల మనుమడు అప్పుగా గుర్తించారు. వీరంతా ఒకే ఇంట్లో మృతిచెంది ఉండటంతో ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులను, బంధువులను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ నేపథ్యం, వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.