హెల్మెట్ ధరించిన వారికి పండ్లు, ధరించని వారికి పూల పంపిణీ
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి
పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్
వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మోటారు వాహనాల నిబంధనలను వాహనదారులకు తెలియజేయడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ ట్రాఫిక్ ఎస్సై దిలీప్ కుమార్, తన సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని, వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, హెల్మెట్ ధరించిన వారికి పండ్లు, ధరించని వారికి పూలను ఇచ్చి వారికి హెల్మెట్ గురించి అవగాహనను కల్పించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు రహదారి నియమాలను పాటించాలని సూచించారు. మోటార్ వాహన నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.