
గోదాముల్లో నిల్వ ఉంచిన వంట నూనెపై సేల్స్ టాక్స్ అధికారులు దాడులు చేయాలి – సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం వంట నూనెపై ఇరవై శాతం సుంకాన్ని పెంచిందని నూనె వ్యాపారులు తమ వద్ద ఉన్న నూనె బ్లాక్ చేసి శనివారం దుకాణాలు మూసి వేయడం పట్ల సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ముడి శుద్ధి చేసిన పామ్ ఆయిల్ సన్ ఫ్లవర్ నూనెపై క్లస్టమ్స్ సుంకాన్ని పెంచిందని క్లస్టమ్స్ సుంకాన్ని దాదాపు ఇరవై శాతానికి శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ పై క్లస్టమ్స్ సుంకాన్ని ముప్పై రెండున్నర శాతానికి పెంచడంతో అప్రమత్తమైన వ్యాపారులు తమ వద్ద ఉన్న వంట నూనె స్టాకులు గోదాములలో నిల్వ ఉంచుకొని ప్రజలకు, చిరు వ్యాపారులకు అమ్మకుండ బ్లాక్ చేశారని రేపటి నుండి పెరిగిన ధరలతో ప్రజలపై దోపిడీకి పాల్పటానికి వ్యాపారస్తులు సన్నద్ధం కావడం సిగ్గుచేటన్నారు. వ్యాపారస్తులు గోదాములలో స్టాకులు పెట్టుకొని బ్లాక్ మార్కెట్ దందాను కొనసాగిస్తున్న సేల్ టాక్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెరుగుతాయనే ముందస్తు సమాచారంతో నూనె వ్యాపారులు శనివారం వారి దుకాణాలను పూర్తిగా బంద్ చేయడం అక్రమ దందాకు పాల్పడడం దుర్మార్గం అని, సేల్ టాక్స్ అధికారులు వ్యాపారస్తుల నిలువలపై తనిఖీలు చేయాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో గోదాములపై దాడులు చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న పాత స్టాక్ ను పాత ధరలోనే అమ్మాలని లేనిచో దాడులు తప్పవని హెచ్చరించారు.