
Nirmal
స్థానికం దిశగా..
నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
ఎట్టకేలకు ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) స్థానాలు ఖరారు కావడంతో ఇక స్థానిక సమరం ఊపదుకోబోతోంది. జిల్లాలో (Nirmal) మొత్తం 18జడ్సీటీసీ స్థానాలు ఉండగా 156 ఎంపీటీసీ స్థానాలకు గానూ మరో ఎంపీటీసీ స్థానం అదనంగా పెరిగింది. దీంతో 157 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. ఈ స్థానాల సంఖ్య ఖరారు కావడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేసే ఔత్సాహికులు ఇక రిజర్వేషన్ల ఆధారంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుండగా మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి జడ్పీ చైర్మన్ పదవి దక్కనుంది.
కీలకం కానున్న జడ్పీటీసీ పదవులు…
జిల్లాలో అత్యంత ప్రాధాన్యతగల పదవిగా చెప్పుకునే జడ్పీచైర్మన్ పీఠంపై ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే సీరియస్ గా దృష్టి కేంద్రీకరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని తమ ప్రతిష్టను ఇనుమడింపజేసుకోవాలని యోచిస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న కారణంగా ఆ పార్టీ జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ రావడాన్ని కూడా ఆ పార్టీ ప్రతిష్టగా భావిస్తోంది. ఎలాగైనా 15 జడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని జడ్పీచైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డితో పాటు రామారావు పటేల్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారంటున్నారు. వీరికి తోడుగా స్వత్రంత్ర అభ్యర్థులు సైతం జడ్పీటీసీ పోటీకి ఇప్పటి నుంచే సిద్దమవుతుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది.