టంగుటూరును ముంచెత్తుతున్న టిప్పర్ల దుమ్ము
వారం రోజులుగా ప్రజల నరకయాతన
దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిన్నారులు, వృద్ధులు – అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
శంకర్ పల్లి, నేటిధాత్రి:
శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో టిప్పర్ లారీల రాకపోకలు గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో నిరంతరం తిరుగుతున్న టిప్పర్ల వల్ల భారీగా దుమ్ము ఎగిసిపడుతూ గ్రామమంతా దుమ్ముతో కప్పుకుపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో టిప్పర్ లారీలు గ్రామం గుండా వెళ్తుండటంతో రోడ్లపై మట్టి పేరుకుపోయి, వాహనాలు వెళ్లిన ప్రతిసారి దుమ్ము మేఘాల్లా ఎగురుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్తమా, అలర్జీ సమస్యలు మరింత పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లలోకి, దుకాణాల్లోకి, వంటగదుల్లోకి దుమ్ము చేరడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టిప్పర్ లారీలు అతివేగంగా ప్రయాణించడం మరో సమస్యగా మారింది. చిన్నపిల్లలు రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
టిప్పర్లపై టార్పాలిన్ కవర్లు వేయకుండా మట్టి తరలించడం, రోడ్లపై నీటిని చల్లకుండా వాహనాలను నడపడం వల్లే ఈ సమస్య తీవ్రంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా రవాణా శాఖ, పోలీసు శాఖ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో నీటి చల్లింపు చర్యలు చేపట్టాలని, టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని టంగుటూరు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
