Tight Security with 570 Police Personnel for Panchayat Elections
570 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కాటారం సబ్ డివిజన్ లోని కాటారం,ముత్తారం, మహాదేవపూర్, కొయ్యూరు గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తిస్థాయి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను విడిచిపెట్టరాదని ఆదేశించారు. రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద లేదా రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఏంసీసీ) అమలులో ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎలాంటి విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ తెలిపారు.
