బక్రీద్‌కు రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట భద్రత

బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు

– డీజీపీ సి.వి ఆనంద్

– గోవుల అక్రమ రవాణా, గోవధ నివారణపై ప్రత్యేక దృష్టి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల పోలీసు అధికారులు,సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, పరస్పర సామరస్యంతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేకంగా గోవుల అక్రమ రవాణా, గోవధ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సంతల్లో కొనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశు వైద్యాధికారులచే జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, రవాణా అనుమతి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు.పత్రాలు లేకుండా పశువులను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు,చెక్‌పోస్టులు,ప్రధాన రహదారులు,పశువుల రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

అలాగే అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే పేరుతో కొందరు వ్యక్తులు లేదా సంఘాలు బృందాలుగా ఏర్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పోలీసు శాఖదేనని, ఎవరూ స్వచ్ఛందంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు.ప్రతి జిల్లాలో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి మత పెద్దలు, స్థానిక నాయకులతో సమన్వయం పెంచాలని పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాంటి పోస్టులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పండుగ సందర్భంగా మసీదులు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు మరియు ముఖ్య కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ,డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సి.ఐ రవి, డిటిఓ లక్ష్మణ్ , రెవెన్యూ, వెటర్నరీ శాక అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version