ఫూలే దంపతుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి!

జైపూర్ ఏసిపికి వినతిపత్రం సమర్పించిన బీసీ సంఘాల నాయకులు

జైపూర్, నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో నెలకొన్న మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వివిధ బీసీ బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో కొందరు దుండగులు మహాత్మ ఫూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను ధ్వంసం చేశారని వారు తెలిపారు. ఆగ్రహించిన గ్రామస్తులు దుండగులను పట్టుకుని బంధించి పోలీసు వారికి అప్ప చెప్పడం జరిగింది. మహాత్మ జ్యోతిబాఫూలే ఈ దేశంలోని బడుగు వర్గాల సంక్షేమం కోసం ఉద్యమించిన మహానుభావుడు, దేశమంతా ఆయన్ని గౌరవిస్తూ పూజలు చేస్తున్నారు. అందరికీ ఆరాధ్యనీయుడైన మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం క్షమించరాని విషయము. ఈ వార్త విన్న జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై విచారించి నిందితులను శిక్షించడంతోపాటు ఈ దుస్సంఘటనకు కారకులైన వారందరినీ అదుపులోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగని రీతిలో శిక్షించాలని వారు కోరారు. విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన మహాత్మా ఫూలే అందించిన చైతన్యం సమసి పోదని, బహుజన బిడ్డలు ఐక్యంగా ఉద్యమిస్తారని వారు మనువాదులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక మంచిర్యాల జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బహుజన ఐక్యవేదిక నాయకులు దుర్గం ఎల్లయ్య, బీసీ ఐక్యవేదిక జిల్లా కమిటీ నాయకులు సమ్ము రాజయ్య, చల్లపల్లి అంజయ్య, రాసపల్లి రాజు, నూతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!