బతికుండగానే చంపేశారు.. సంగారెడ్డి జిల్లాలో సంచలన సంఘటన…
◆ అధికారుల తప్పుడు ధృవీకరణ పత్రం…
◆ సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన సంఘటన…
◆ బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి..
◆ అధికారులపై కలెక్టర్ క్రాంతి వల్లూరు సీరియస్…
◆ ఆరి, డిప్యూటీ తహసీల్దార్ పై పడిన వేటు…
◆ మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
రెవెన్యూ అధికారుల తప్పుడు ధృవీకరణతో భూములు తారుమారైన సంఘటన జహీరాబాద్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. బాధితుల అప్రమత్తతతో రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించడంతో వారికి కొంత మేరకు ఊరట కలిగింది. ఇందుకు కారకులైన ఇద్దరు రెవెన్యూ అధికారుల పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధ్రువీకరణ తెచ్చిన తంటాతో ఇద్దరు అధికారులు సస్పెన్షన్ గురవ్వగా, అంతటితో ఆగుతుందా లేక మరి కొందరి పై వేటు పడుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. జహీరాబాద్ మండలం కొత్తూరు( బీ) గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని సర్వే నంబర్ 7/అ- లో బాధితుడు రాయికోడ్ షేక్ అహ్మ ద్, ఆయన అన్న దివంగత ఇస్మాయిల్ ఇద్దరు కలిసి 1995లో 1.29 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందులో బాధితుడు షేక్ అహ్మద్ పేరుమీద 0.34 గుంటల భూమి ఉంది. ఈయన బతికే ఉన్నప్పటికీ అతను చనిపోయినట్లు ఇతరుల పేరుతో వాస్తవికతకు విరుద్ధంగా తప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం అధికారులు మంజూరు చేశారు. దీంతో తప్పుడు వారసత్వం పొందిన వారు మరొకరికి, వారు ఇంకొకరికి ఇలా ముగ్గురి పేరుతో లావాదేవీలు జరిగాయి. చివరిగా నెల క్రితం కబ్జాపైకి రావడంతో బాధితులు అప్రమత్తమయ్యారు.సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు విచారించి తగిన చర్యలు తీసుకున్నారు. తప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేసి భూ తగాదాలకు కారకులు గతంలో జహీరాబాద్ డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేసి, ప్రస్తుతం కల్హేర్ డిప్యూటీ తహశీల్దార్ గా చేస్తున్న బీటీ. పవన్ కుమార్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాది లాల్ లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరుపకుండానే బతికి ఉన్న వ్యక్తి చనిపోయినట్లు పంచనామా నివేదిక సమర్పించారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన డిప్యూటీ తహశీల్దార్ బీటీ. పవన్ కుమార్, తప్పుడు నివేదిక సమర్పించిన ఆర్ఐ యాదిలాల్ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా మరణ ధ్రువపత్రం జారీచేసిన గ్రామ, మున్సిపల్ స్థాయి అధికారి, సిబ్బంది పై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

భూ మాతలో ఫౌతీకి గడువు..
ధరణి పోర్టల్ లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని తప్పుగా వారసత్వ ఆస్తిని ఇతర వ్యక్తులు పొందారు.
అదే భూ మాత పోర్టల్ లో అలాంటి తప్పులకు ఆస్కారం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
వారసత్వం కింద భూమి బదలాయింపునకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తుల వారసత్వ ఉదాహరణ కోసం నోటీసులు జారీచేసి, విచారణ జరుపుతారు.
వారం రోజుల పరిశీలన అనంతరం అభ్యంతరాలు రాకుంటే వారసుల పేర్లతో భూమిని బదలాయింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.