Woman Seeks Justice Over Land Access Dispute in Hanumakonda
దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి
– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు
హనుమకొండ:నేటిధాత్రి
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిలోకి బాట లేదని వెళ్లనివ్వకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన బొక్క తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 133 ఏ, 133 బి, 148b2, 148సి/1/1/3 సర్వే నెంబర్లలో మొత్తం మూడు ఎకరాల రెండు గుంటల భూమి ఉండగా గత 45 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నామని కానీ గత కొంతకాలంగా తమ భూమి లోకి వెళ్లకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసిందని దానితో స్థానిక ఆర్డిఓ తహసిల్దార్ విచారణ చేసి గతంలో లాగానే వ్యవసాయ పనుల నిమిత్తం మోహన్ రెడ్డి భూమి నుండి తమ భూమి లోకి వెళ్లే విధంగా తీర్పు ఇచ్చారని దానికి మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ వ్యవసాయ పనులకు తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గతంలో తమను తీవ్రంగా కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని దానిని ఇప్పుడు ఉపసంహరించుకోమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.దీని పూర్తి వివరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
