
Dirt Road
ఊరు పొలిమేరల్లో డబుల్ రోడ్డు,ఊరిలో మాత్రం మట్టి రోడ్డు..
ఇరుకుదారితో అవస్థలు పడుతున్న వాహనదారులు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
పోత్కపల్లి – జమ్మికుంట డబుల్ రోడ్డుతో ప్రయాణికులకు రహదారి సౌకర్యం కాస్త మెరుగుపడినప్పటికి పొత్కపల్లి రైల్వే స్టేషన్ గేట్ల వద్ద మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. పొత్కపల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ నుండి బ్యాంకు వరకు గల సుమారు కిలోమీటర్ దూరంలో రెండు రైల్వే గేట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం లో సదరు కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం తో గుంతల మాయం గా మారి అనేక ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని, అంగడి ప్రాంతం నుండి బ్యాంకు వరకు గల రహదారి ఎప్పుడు చూసినా క్రిక్కిరిసిపోయి ఉంటుంది. ఈ రహదారికి ఇరువైపులా అనేక షాపులు, సహకార బ్యాంకు, వాణిజ్య బ్యాంకు మరియు పాఠశాలలు ఉన్నాయి. ప్రజలు తమ అవసరాల నిమిత్తం నిత్యం ఈ రైల్వే గేట్లను దాటుతుంటారు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, పాదచారులతో ఎప్పుడు చూసినా ఇక్కడ రోడ్డుపై రద్దీగా ఉంటుంది. రైళ్ల రాకపోకల సందర్భంలో గేట్లు వేసినప్పుడు వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది. బస్సులు ఎదురెదురు పడిన సందర్భంలో ఎవరో ఒకరు రివర్స్ గేర్ వేయాల్సిందే. దానికి తోడు షాపుల ముందు క్రమశిక్షణ లేని ద్విచక్ర వాహనాల పార్కింగ్ అనేక మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. రైల్వే గేట్ల కారణంగా వాహనాలు నిలిపివేయాల్సిన పరిస్థితిలో, రోడ్డు వెడల్పు లేని కారణంగా ఎదురెదురు వాహనాలకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇటీవల నూతనంగా రోడ్డు వేసిన సందర్భంలో ఇక్కడ వెడల్పుగా సైడ్ బర్ములతో వాహనాల నిలుపుదలకు అనువుగా రోడ్డును నిర్మించవలసి ఉండగా, విస్మరించిన కారణంగా ఇరుకు రోడ్డు రవాణా వాహనదారులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు మేల్కొని గ్రామం లో వదిలేసిన రోడ్డు పూర్తి చేసి రైల్వే గేటుకు ఇరువైపులా కిలోమీటర్ దూరంలో వాహన దారులకు అనువుగా రోడ్డును వెడల్పు చేసి ట్రాఫిక్ కష్టాలను తొలగించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. అంతే కాకుండా రెండు రైల్వే గేట్లను నిర్మించిన రైల్వే అధికారులు సమీపంలో ఒక అండర్ పాస్ ను సైతం నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి . స్థానిక నాయకులు, రైల్వే అధికారులు మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేసి గ్రామస్తులకు అనువుగా రైల్వే స్టేషన్ సమీపంలో అండర్ పాస్ నిర్మాణానికి కృషి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.