సిట్ కస్టడీకి చెవిరెడ్డి జైలు వద్ద హల్‌చల్…
Chevireddy Custody: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని సిట్ విచారించనుంది.
విజయవాడ, జులై 1: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy), వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు (SIT Officials) అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని విచారించేందుకు ఏసీబీ కోర్టు నిన్న (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఉదయమే చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును కూడా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించేందుకు సిట్‌కు కోర్టు అనుమతించింది.అయితే కస్టడీలోకి తీసుకునే సమయంలో మరోసారి జైలు వద్ద చెవిరెడ్డి హల్‌చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో ‘నా పై తప్పుడు కేసు పెట్టారంటూ’ అరుస్తూ వచ్చారు. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరిస్తూ చెవిరెడ్డి పోలీసు జీపు ఎక్కారు. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి ఏ 38గా ఉండగా, వెంకటేష్ నాయుడు ఏ 34గా ఉన్నారు. ఐదు రోజుల పాటు చెవిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరినప్పటికీ కేవలం మూడు రోజుల పాటు కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది కోర్టు. అలాగే జైలులోని దేవాలయానికి వెళ్లేందుకు చెవిరెడ్డికి పది నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది. కానీ బయట ఆహారం పంపాలన్న మాజీ ఎమ్మెల్యే అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తోసిపుచ్చింది.