నగదు గడియారాలు అపహరణ.
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలోని గౌరీ డిజిటల్స్ ఫోటో అండ్ వీడియో గ్రాఫ్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగిందని బాధితుడు షాప్ యజమాని కథనం ప్రకారం గోపాలరావుపేట బస్టాండ్ ప్రధాన కూడలిలో గత రెండేళ్లుగా గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ఫోటో స్టూడియో వీడియోగ్రాఫితో పాటు గడియారాల విక్రయం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో వ్యాపారంలో భాగంగా ఆదివారం ఉదయం దుకాణం తెరిచి లోపలికి వెళ్లి పరిశీలించగా వెనుక తలుపులు తెరిచి ఉండడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీంతో వెంటనే అనుమానం వచ్చి కౌంటర్ పరిశీలించగా అందులోనుండి పదివేల ఐదువందల నగదు, ఇరవై గడియారాలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ఎస్సై సురేందర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వెనుక నుంచి తాళం పగలగొట్టి లోపల ప్రవేశించిన దొంగలు నగదు గడియారాలు అపరిచినట్లు బాధితుడు తెలిపారు. ఇంతే కాకుండా పక్కనున్న పీపుల్స్ క్లినిక్, మయూరి జనరల్ స్టోర్ తో పాటు పలు దుకాణాలలో చోరీ చేయుటకు తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అవి పగులకపోవడంతో విఫలమైనట్లు తెలుస్తోంది. నాలుగైదు దుకాణాల్లో తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నించటప్పడికి పగలకపోవడంతో చేసేదేమి లేక దొంగలు తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసంఘటనే కాకుండా గత ఏడాదిలో ఇదే బస్టాండ్ ప్రాంతంలో పక్కాగా పట్టపగలు రెక్కీలు నిర్వహించి అర్ధరాత్రి పూట చోరీలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. గోపాలరావుపేట గ్రామంలో పోలీసులు గ్రామస్తుల సహకారంతో నిఘానేత్రాలను అమర్చినప్పటికీ అవి పని చేయకపోవడంతో దొంగలు చోరీల ఘటనలకు ఈజీగా పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో వెంటనే సీసీ కెమెరాలను పునరుద్ధరిస్తే దొంగతనాలను అరికట్టవచ్చని, ఇటీవల వచ్చిన నూతన ఎస్సై సురేందర్ దొంగతనాల ఘటనలపై దృష్టి పెట్టి దొంగతనాల ఘటనలకు అడ్డుకట్ట వేస్తారో లేదో లేదోనని గ్రామస్తులు కోరుతున్నారు.