`బాధ్యతలేని సమాజంలో బతుకుతున్నాం.
`చదువు పేరుతో పిల్లలను నరకకూపంలోకి పంపుతున్నాం.
`పేరున్న విద్యా సంస్థలని లక్షలు పోసి సీట్లు కొంటున్నాం.
`పిల్లల జీవితాలతో కాలేజీలు ఆటలాడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్నాం
`చేష్టలుడిగి మన చేతగాని తనానికి సిగ్గు పడుతున్నాం
`తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతున్నాం.
`పిల్లలకు గొప్ప చదువులు చదివించాలని ఆరాటపడుతున్నాం.
`మన కోరికలను వారి మీద బలవంతంగా రుద్దేస్తున్నాం.
`వారికి ఎలాంటి చదువు ఇష్టమో కనుక్కోలేకపోతున్నాం.
`లక్షల ఫీజులు చెల్లించి బందర దొడ్డి లాంటి కాలేజీలకు పంపిస్తున్నాం.
`వాళ్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేయం.
`కాలేజీలో సమస్యల గురించి పిల్లలు చెబితే వినిపించుకోం.
`చదవలేక కుంటిసాకులు చెబుతున్నారని బెదిరిస్తాం.
`లక్షల ఫీజులు చెల్లించామని పిల్లల్నే భయపెట్టిస్తాం.
`మన పిల్లలు మన వద్ద వుంటే చదవలేరని మనమే డిసైడ్ అవుతాం.
`హస్టళ్లలో వేస్తేనే భయంతో చదువుతారని గుడ్డిగా నమ్మేస్తుంటాం.
`మన బలహీనతలు విద్యా సంస్థల అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాయి.
`మన పాలిట యమపాశాలౌతున్నాయి.
`అయినా మనం కళ్లు తెరవం.
`కార్పొరేట్ కాలేజీలకి పిల్లలను పంపడం ఆపం.
`మన దౌర్భాగ్యం…కార్పొరేట్ కాలేజీల అరాచకాలను నిలదీయలేం.
`ఎన్ని దుర్మార్గాలు చేసినా మళ్ళీ మళ్ళీ అవే కాలేజీలకు పంపిస్తుంటాం.
`మనమెందుకు మారతాం..పిల్లల ప్రాణాలు పోతున్నా చలించం.
`చదువు పేరుతో ఆడపిల్లలను రాక్షసుల మధ్యకు పంపిస్తూనే ఉంటాం.
తెలంగానలోని కార్పోరేట్ కాలేజీల్లో రోజుకో వివాదం ముసురుకుంటోంది. కాలేజీలలో యాజమాన్యాల పట్టింపు లేని తనం, అందులో పనిచేసే ఉద్యోగుల నిర్లక్ష్యం, దుర్మార్గాల మూలంగా విద్యార్దుల జీవితాలు ఆగమౌతున్నాయి. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల దాకా అనేక రకాలైన వివాదాలు చుట్టుముడుతూనే వున్నాయి. యాజమాన్యాలు సంపాదన మీద పెట్టే దృష్టి పిల్లల భద్రత మీద పెట్టడం లేదు. నోట్లు లెక్కపెట్టుకోవడంలో వున్న శ్రద్ద మహిళా విద్యార్ధులకు రక్షణ కల్పించడంలో చూపడం లేదు. అసలు కాలేజీ హస్టళ్లలో అమ్మాయి వీడియోలు రహస్యంగా తీస్తూ, వారి జీవితాలతో ఆటలాడుకునేంత ధైర్యం ఎలా వచ్చింది? అమ్మాయిలు వుండే హస్టళ్లలో ఎన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలో అవగాహన లేకుండా పోతోందా? అందులో పనిచేసే ఉద్యోగుల వ్యహరశైలి ఎలా వుందో తెలుసుకోలేనంత తీరక యాజమాన్యాలకు లేదా? తాజాగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఉదంతంలో దోషులను కఠినంగా శిక్షించాల్సి వుంది. కాలేజీ యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం వుంది. ప్రైవేటు కార్పోరేట్ కాలేజీలలో ఏం జరిగిన పాలకులు పట్టించుకోరన్న ఒక భావన అందరిలోనూ ఏర్పడిపోయింది. విద్యా సంస్దలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విద్యార్దుల కేరిర్ పాడైపోతుందనో, ఏడాది విద్యా కాలం వారికి వృధా అవుతుందని పాలకులు దూర దృష్టితో ఆలోచిస్తుంటే, యాజమన్యాలు మాత్రం సంకుతంగా తయారౌతున్నారు. పాలకులు తమ జోలికి రారన్న ధీమాతో వుంటున్నారు. ఇటీవల నగరశివారులో వున్న అనేక కార్పోరేట్ కాలేజీలో అనేక వరుస సంఘటలను జరిగాయి. శ్రీచైతన్య కాలేజీలో ఓ అమ్మాయి చనిపోయింది. మరో కాలేజీలో వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే చామకూర మల్లారెడ్డి కాలేజీలో ఆహారం విషయంలో విద్యార్ధులు రోడ్కెక్కారు. లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్దులు ఆందోళన చేశారు. నాసిరకం బోజనాల మూలంగా అనారోగ్యం పాలౌతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. ఆ వివాదం ముగిసిపోకముందే చామకూర మల్లారెడ్డి కాలేజీలో విద్యార్ధునులకు చెందిన వీడియోలు తీస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విద్యార్దులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పాలమ్మిన, పూలమ్మిన, పడరాని కష్టాలు పడినా అని చెప్పుకునే మల్లారెడ్డి కాలేజీలో నీతి మాలిన పనులు చేస్తుంటే ఏం చేస్తున్నాడు. దేశంలోనే ఎక్కడా లేనన్ని విద్యా సంస్ధలు ఏర్పాటు చేశానని, తన కాలేజీలలో వున్న సౌకర్యాలు మరెక్కడా లేవంటూ ఊదరగొట్టే మల్లారెడ్డి ఈ విద్యార్దులకు ఏం సమాధానం చెబుతారు.
విద్యా సంస్ధలు ఏర్పాటు చేసుకోవడం, అక్రమాలు చేయడం, రాజకీయాల్లో చేరడం తప్పులను కప్పిపుచ్చునేందుకు అండగా మల్చుకోవడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఇదే మల్లారెడ్డి అల్లుడికి చెందిన మెడికల్ కాలేజీలో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసి ఠాగూర్ సినిమాను చూపించారని బంధువులు ఆందోళన చేశారు. ఇలా విద్యా సంస్ధల ముసుగులో కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. చామ కూర మల్లారెడ్డి కాలేజీలో చదువుకునే అమ్మాయిలు గత కొంత కాలంగా కాలేజీకి అనుబంధమైన హాస్టల్‌లో ఏదో జరుగుతోందని వార్డెన్‌కు పిర్యాధులు చేస్తూనే వున్నారు. గత మూడు నెలల నుంచి ఏదో జరుగుతోందన్న అనుమానం అమ్మాయిలు వ్యక్తం చేస్తూనే వున్నారు. అయినా వార్డెన్‌లో స్పందన లేదని, పైగా తమనే బెదిరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. తీరా పిల్లలు నిలదీస్తే అమ్మాయిలు బాత్ రూముల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందుకోసం కెమెరాలు ఏర్పాటు చేసినట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే అమ్మాయిలు కాలేజీలలో చేరింది హస్టల్ బాత్ రూంలలో ఆత్మహత్యలు చేసుకోవడానికా? ఇలాంటి సమాధానాలు ఎవరైనా చెబుతారా? అంటే కాలేజీ హస్టళ్లలోని బాత్ రూంలలో తామే కెమెరాలు ఏర్పాటు చేశామని వార్డెన్ చెబుతున్నప్పుడు వెంటనే మల్లారెడ్డి చర్యలు తీసుకోవాలి. ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుగుతున్న మల్లారెడ్డి కాజీలను మూసేయించాల్సిన అవసరం వుంది. మల్లారెడ్డి కాలేజీ మూసేస్తే విద్యార్ధులకు ఒక ఏడాది విద్యా సంవత్సరం వృధా అవుతుందేమో కాని, వారి జీవితాలకు భద్రత దొరుకుతుంది. లేకుంటే వారి జీవితాలు నాశనమౌతాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆడపిల్లలకు భద్రత లేకుండా వుంది. ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న విద్యార్దుల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వున్న కాలేజీల అనుమతులు రద్దుచేస్తే, ఇతర కాలేజీల్లో భయం ఏర్పడదు. విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజీలను గుర్తించి, వాటి గుర్తింపు రద్దు చేస్తే తప్ప విద్యా వ్యవస్ధలో మార్పులు రావు.
కాలేజీల వ్యవహారం ఇలా వుంటే తల్లిదండ్రుల దౌర్భాగ్యం మరోలా వుంది. మనం బాధ్యత లేని సమాజంలో బతుకుతున్నామన్న సోయి తల్లిదండ్రుల్లో కూడా కరువౌతోంది. పేరున్న కాలేజీ, కార్పోరేట్ కాలేజీల పేరుతో సాగుతున్న దందాలను తల్లిదండ్రులే పెంచి పోషిస్తున్నారు. కాలేజీలు ఇష్టాను సారం నిర్ణయించిన లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి, ఆ కాలేజీలలో చదవించడం కూడా స్టేటస్ సింబల్ అన్నట్లుగా మారిపోతున్నారు. ఉన్నత విద్య చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నారంటూ గొప్పలు చెప్పుకోవడం అలవాటు చేసుకున్నారు. కాని అందులో చదివినంత మాత్రానే ఉద్యోగాలొస్తాయని, ఉజ్వలమైన భవిష్యత్తు వుంటుందన్న అపోహలు పెంచుకుంటున్నారు. గొర్రెల్లా ఒకరిని చూసి ఒకరు తమ పిల్లలను ఆ కాలేజీలలో చేర్పిస్తున్నారు. అందుకే చామకూర మల్లారెడ్డి కాలేజీల మీద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాడు. తమ పిల్లల చదవు పేరుతో మల్లారెడ్డి కాలేజీల లాంటి నరకకూపంలోకి పంపిస్తున్నామని తెలుసుకోవడం లేదు. ఆ కాలేజీలో చదివితే ర్యాంకులోస్తాయని, మంచి ఉద్యోగాలొస్తాయన్న భ్రమల్లో తల్లిదండ్రులు వుంటున్నారు. అందులో చదివినా, ఎందులో చదవినా మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వరు. విద్యార్ధుల నాలెజ్డ్, స్కిల్స్‌తోనే ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప మల్లారెడ్డి కాలేజీలో చదినంత మాత్రాగా ఉద్యోగాలు ఇచ్చే కంపనీలు గుడ్డిగా సెలెక్ట్ చేయరు. లక్షలకు లక్షలు జీతాలు ఇవ్వరు. ఎవరో ఒకరికి మంచి మంచి ప్యాకేజీలు వచ్చాయని, ఆ కాలేజీలో చదితేనే వెంటనే ఉద్యోగాలు వస్తాయన్న ప్రచారాన్ని తల్లిదండ్రులు నమ్మడం ఒక వ్యసనంగా మార్చుకున్నారు. పేరున్న విద్యా సంస్ధలంటూ లక్షలకు లక్షలు పోసి తమ పిల్లలను అందులో చేర్చుతున్నారు.
మంచి భవిష్యత్తు కోసమంటూ తమ పిల్లలను అలాంటి కాలేజీల్లో చేర్పిస్తే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు ఆగమౌతున్నాయి. అవి మాత్రం ఏ తల్లిదండ్రులకు కనిపించవు. తమ పిల్లలు మాత్రమే మంచి వాళ్లు. ఇతరుల పిల్లలు చెడ్డవారన్న అభిప్రాయం కూడా ప్రతి తల్లిదండ్రులలోనూ నాటుకుపోతోంది. తమదాకా వస్తే గాని గుండెలు పగిలే నిజాలు వినపడవు. మల్లారెడ్డి కాలేజీలో ఇంతటి దారుణం జరిగిందని తెలిసినా తల్లిదండ్రులు ఎందుకు మౌనంగా వుంటున్నారు? కాలేజీలో ఆందోళన చేస్తున్న వారికి ఎందుకు సంఫీుభావం ప్రకటించడం లేదు. తమ పిల్ల ల జీవితాలను ఎలా ఆగం చేస్తారని నిలదీసేందుకు ఎవరూ వెళ్లడం లేదు. ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కాదా? చేతగాని తనం కాదా? చేష్టలుడిగి చూసే తనం కాదా? విద్యార్థులతోపాటు, వివిధ పార్టీల విద్యార్ధి నాయకులు మల్లారెడ్డి కాలేజీ ముందు ఆందోళనలు చేస్తుంటే , తల్లిదండ్రులు ఎందుకు మేలుకోవడం లేదు. తమ పిల్లలు గొప్ప చదువులు చదవాలన్న ఆరాటం వుంటే సరిపోదు. లక్షలు పోసి పిల్లలను చదవిస్తున్నాం..ఫీజులు చెల్లిస్తున్నామని గొప్పలుచెప్పుకుంటే గెలిచినట్లు కాదు. పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నవారిని ప్రశ్నించడంలో తల్లిదండ్రులు చొరవ చూపించకపోవడం కూడా తప్పే. అన్యాయం జరిగిన అమ్మాయిల తల్లిదండ్రులకు సంఫీుభావంగా మిగతా పిల్లల తల్లిదండ్రులు కలిసి వచ్చిన సందర్భాలే కనిపించవు. అందుకే కాలేజీల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. తప్పులు చేసిన ఎవరూ పట్టించుకోరనుకుంటున్నాయి. తప్పుల మీద తప్పులు జరుగుతున్నా పట్టింపు లేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయి.