
Boddemma Festival Celebrations Begin in Telangana
ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…!
మొదలాయే… ప్రకృతిని ఆరాధించే పండగ…
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్ తోట బజార్ లో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బొడ్డెమ్మ పండగ వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బొడ్డెమ్మ మరియు బతుకమ్మ పండగ రానే వచ్చింది.
ఈ పండగ వస్తే తెలంగాణ మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పొద్దంతా ఎన్ని పనులు చేసి అలసిపోయిన సాయంత్రం సంధ్యా సమయం అయిందంటే వారి ఆనందాలకు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా వాళ్ళ యొక్క సంబరాలు భక్తి పాటలతో జానపద గేయాలతో లయబద్ధంగా ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవుగా అన్నట్టు ఊరు ఊరంతా వాడవాడలా బొడ్డెమ్మ సంబరాలు మహిళలు ఎంతో జోరుగా హుషారుగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలు ఎంతో ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు అమావాస్యకు పితృపక్ష రోజులలో గౌరీ దేవికి అత్యంత పవిత్రమైన రోజులుగా భావించి నిర్వహించే బొడ్డెమ్మ పండుగ వేడుకలను కన్నె పిల్లలు,మహిళలు సాయంత్రం సంధ్యా సమయములో పుట్ట మట్టి తీసుకొని వచ్చి తొమ్మి దొంతరలు లేదా ఐదు లేదా మూడు అమ్మవారి ప్రతిరూపంగా భావించి (గద్దెలుగా) పేర్చి తయారుచేసి ఎర్రమట్టితో అలికి, పసుపు, కుంకుమ పూలతో అలంకరించి గౌరీ దేవి రూపంలో తల్లికి తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఆటపాటల కోలాటాలతో నిర్వహిస్తారు. బొడ్డెమ్మ చరిత్ర కొన్ని కథనాల ప్రకారం బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ కంటే ముందు నుంచి ఉంది అని చరిత్ర చెబుతోంది, క్రీస్తుశకం 8వ శతాబ్దంలో అంతకంటే ముందు నుంచే ఈ పండుగ ఆచరణలో ఉందని భావిస్తున్నారు. రామాయణ ,మహాభారత, భాగవత ఘట్టాలను, శివపార్వతి, సీతారాముల కళ్యాణ ఘట్టాలను జానపదుల పాటల రూపంలో బొడ్డెమ్మ పండుగలో కోలాటాల ఆటపాటలతో జరుపుకున్నారని.ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిలో ప్రకృతిని ప్రకృతి ఇచ్చే పూలతో ప్రకృతిని ఆరాధించడమే ఈ బొడ్డెమ్మ, బతుకమ్మ పండగ అని పురాణాలు చెబుతున్నాయి, ఈ బొడ్డెమ్మ పండగ ఒక భాగం ఇది మహిళలు తమ సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తించుకోవడానికి ఆనందించడానికి ఒక వేదికగా అందిస్తుంది.