
Chakali Ilamma Anniversary Celebrated in Bhupalpally
మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని, వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి ఉన్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకున్నట్లు తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయన్నారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.
భూపాలపల్లి బస్టాండ్. భూపాలపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు రజక కులస్తులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు