ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి…
నేటి ధాత్రి -గార్ల :-
మండల పరిధిలోని గార్ల,ముల్కనూర్, చిన్నకిష్టపురం,పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, శేరిపురం,మర్రిగూడెం, పుల్లూరు,పోచారం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట,మద్దివంచ, రాంపురం తదితర గ్రామపంచాయతీలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీ పథకం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.అసౌకర్యాల నడుమ మండుటెండల్లో చెమట చిందించి పనిచేసిన కార్మికులకు 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానాన్ని పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బ్రతుకుతారని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదుల ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెబుతారని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు..