
భద్రాచలం నేటి ధాత్రి
ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఇన్చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
బుధవారం నాడు భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేసి మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం పెడుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులకు ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాలల్లో చేరిన విద్యార్థినిల పట్ల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, వాతావరణం మరియు స్థలం మార్పు వలన పిల్లల యొక్క ఆరోగ్యములో మార్పులు సంభవిస్తాయని గమనిస్తూ ఉండాలని, ఎవరైనా పిల్లలు అస్వస్థతకు గురి అయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. పాఠశాలల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా టాయిలెట్, మంచినీరు, బాత్రూమ్స్, కరెంటు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున పిల్లలు రాత్రిపూట బయటకు రాకుండా చూడాలని, విషపూరితమైన క్రిమి, కీటకాలు, పాములు, తేళ్లు సంచరిస్తూ ఉంటాయని సంబంధిత సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయన సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం పాఠశాల నిర్వహణ తీరు చాలా బాగుందని, ఇదేవిధంగా ప్రతిరోజు పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ రావు, డి డి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ,ఏసీఎంవో రమణయ్య, ఏ టి డి ఓ నరసింహారావు, పాఠశాల హెచ్ఎం సుభద్ర, తాసిల్దార్ శ్రీనివాస్, ఈవో జిపి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాలు అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది-