
Modern Society
ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…
సమిష్టి జీవన, పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…
బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసులే…
ఆదివాసులు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి…
ఆదివాసి ప్రాంతాల్లో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి…
ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…
సనాతన ప్రజల తెగలు నేడు అంతరించిపోతున్నాయి…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసి ప్రజలు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకుని తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తున్నారు. వారికి అడవి అంటే ప్రాణం. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి ఆదివాసులు అడవి బిడ్డలుగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో బ్రతుకుతున్నారు. విద్య వైద్యం అందని ఆదివాసీల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. అతి పురాతన సనాతన ప్రజల తెగలు అంతరించిపోతున్నాయి.సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. దేశంలో ఆదివాసీ జనాభా 12 కోట్ల మంది ఉన్నారు. ఆదివాసి ప్రజలు ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలో నివాసం ఉంటున్నారు. 20% పైగా భూభాగంలో విస్తరించి ఉన్నారు. ఆదివాసి ప్రజల పాదాల కింద 80% ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నది. ఆదివాసుల జ్ఞానం,సంస్కృతి పాలన వ్యవస్థలపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలి. ఆదివాసీలు వారి పేరు ప్రతిబింబించే విధంగా ఉపఖండంలోని తొలి నివాసులు మరియు ఒకప్పుడు వారు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా పెద్ద ప్రాంతాల్లో నివసించారు. చుట్టూ దట్టమైన అరణ్యం. కొండకోనల మధ్య ఆవాసం. సంప్రదాయాలు,కట్టుబాట్లతో జీవనం. విలక్షణమైన అహార్యం. గొప్ప ఐక్యత. అడవి తల్లి ఒడిలో నిత్యం ఒదిగి సాగే పయనం. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసుల సొంతం. వాళ్లే దేశానికి మూలవాసులు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న గిరి మాణిక్యాలు. ఆదివాసి ప్రజలు అనేక రకాలుగా అన్యాయాలకు గురయ్యారు. కానీ వారు తమ సంస్కృతిని మరియు హక్కులను కాపాడుకోవడానికి నిరంతరం ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసి ప్రజలకు వారి సాంప్రదాయ భూములు, అడవులు మరియు సహజ వనరులపై యాజమాన్యం మరియు యాక్సెస్ హక్కులు ఉంటాయి. ఆదివాసులు బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు. అడవులతో సన్నిహిత సంబంధం కలిగి, ప్రకృతి వనరులపై ఆధారపడి జీవిస్తారు. తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల వారు బ్రతుకు పోరాటంలో నైపుణ్యం సాధించారు.
ఆదివాసి ప్రజలు అడవి ఆధారిత జీవనం సాగిస్తారు. మరియు వారి మనుగడ కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. ఆదివాసి ప్రజలు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో నిండి ఉంటాయి. వీటిని వారు తరతరాలుగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీలు వనరుల దోపిడీ, గుర్తింపు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆదివాసి చట్టాలు అక్కరకు రాని చుట్టాలుగా మారాయి. ఆదివాసి తెగల వాయిద్య పరికరాలు వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీలు తమ హక్కులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి హక్కు, అటవీ సంరక్షణ, విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సమస్యలు ఆదివాసీల హక్కులను కాపాడటం మరియు వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఒక ముఖ్యమైన అడుగు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తూ అడవిని ప్రాణంగా ప్రేమిస్తూ వీరు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలు ఎక్కువగా పండిస్తారు. అయినప్పటికీ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. పాలకుల తీరుతో ఆదివాసీలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. చాలా గ్రామాలకు నేటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. వైద్య సదుపాయాలు మృగ్యం. ఏదైనా రోగం వస్తే డోలిమోతలే దిక్కవుతున్నాయి. ఆదివాసీలు విలక్షణమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. వాటిని పరిరక్షించడం, గౌరవించడం, మరింత ముందుకు తీసుకుపోవడం మనందరి కర్తవ్యం.