
cleanliness, repairs, water supply
సెక్రటరీల బాధలు వర్ణాతితం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ సెక్రటరీల అవస్థలు బిల్లులు రాక, సొంత ఖర్చులతో సేవల నిర్వహణ జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ సెక్రటరీలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పని పూర్తి చేసినా ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాకపోవడంతో, వారు తమ సొంత డబ్బులతోనే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. మండలాల్లో సాగుతున్న గ్రామ శుభ్రత, మరమ్మత్తులు, నీటి సరఫరా, ఎలక్ట్రికల్ పనులు వంటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలన్నీ సెక్రటరీలే ముందుండి నిర్వహిస్తున్నారు. కానీ వాటికి రావాల్సిన నిధులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ – “ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. కానీ గ్రామ అభివృద్ధి ఆగిపోకుండా చూడాలి కదా అని సొంత డబ్బులతో పనిచేస్తున్నాం. వేతనం కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. అయినా సేవ చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాం” అన్నారు. ఈ పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో కనీస వసతులు లేక, పనుల నిర్వహణలో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి, తమ బాధలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న సెక్రటరీల సమస్యలు ప్రభుత్వం త్వరగా గుర్తించాలన్నది వారి ఆకాంక్ష.