పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం
దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.