కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే 8(నేటి ధాత్రి):
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు ముందురోజు, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా పరిశీలించి, ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి, అట్టి నివేదికను ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళినీ, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తునే పోలింగ్ టీంల తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియ సజావు గా సాగుతోందా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల నియమావళి అమలు, తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, మాక్ పోలింగ్ ఇతర అంశాలను పరిశీలించాలని వివరించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్, సిరిసిల్ల ఏఆర్ఓ పూజారి గౌతమి, వేములవాడ ఆర్డీవో, ఏఆర్ఓ రాజేశ్వర్, సీపీఓ శ్రీనివాసాచారి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున రావు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.