జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం జడ్పీ సీఈఓ విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో
జడ్పిటిసిలు, కో ఆప్షన్ సభ్యులు 5 సంవత్సరాలు పదవీకాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదవి కాలం ముగిసిన సందర్భంగా జడ్పిటిసిలు, ఎంపీపీలను, కో ఆప్షన్ సభ్యులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పుష్ప గుచ్చాలు, శాలువా, మెమెంటోలతో సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఐదేళ్ల పదవీకాలంలో
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఎన్నో
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని వారి సేవలను కొనియాడారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగడం సహజమని, ఓటేసి గెలిపించిన ప్రజలకు పదవిలో ఉన్న లేకున్నా ప్రజాసేవ చేయాలని జవాబుదారీతనంతో చేసిన అభివృద్ధిని, ప్రజలకు చేసిన సేవలను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. ప్రజల మన్ననలు పొందిన ప్రజాప్రతినిధులు రాబోయే రోజుల్లో గొప్ప స్థానాలలో ఉంటారని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడమే పరమార్ధంగా భావించినప్పుడు మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు. మీ పదవికాలంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని, మనసు గెలవాలని అపుడే ప్రజల మదిలో పది కాలాలు పాటు నిలిచిఉంటామని ఆయన పేర్కొన్నారు.
జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలోని పలు సమస్యలపై జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహించి అనేక తీర్మానాలు చేయడం జరిగిందని, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించామని సహకరించిన జడ్పిటిసిలకు, ఎంపీపీలకు, కో ఆప్షన్ సభ్యులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి ఇఈఓ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ కల్లం శోభారాణి, అన్ని శాఖల జిల్లా అధికారులు, జడ్పిటిసిలు, ఎంపిపి, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.